నేపాల్‌తో మ్యాచ్‌లో టీమిండియా ఫీల్డర్ల పొరపాట్లపై క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పసికూనతో మ్యాచ్ అనే నిర్లక్ష్యం వద్దని.. ప్రత్యర్థిని తేలికగా తీసుకుంటే భారీ మూల్యం చల్లింకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ఆసియా కప్-2023లో భాగంగా గ్రూప్-ఏలో ఉన్న నేపాల్ తమ తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో పోటీ పడింది. ముల్తాన్‌లో ఆగష్టు 30న జరిగిన ఆరంభ మ్యాచ్ లో పాక్ నిర్దేశించిన 342 పరుగులు స్కోరును.. చేధించలేకపోయింది. నేపాల్ బ్యాటర్లకు ఆతిథ్య జట్టు బౌలర్లు చుక్కలు చూపించారు.
ఆ మ్యాచ్ లో ఓపెనర్లు కుశాల్ భుర్తేల్ 8 రన్స్ కే పెవిలియన్ చేరగా.. ఆసిఫ్ షేక్ 5 పరుగులకే డగౌట్ కు వెళ్లిపోయాడు. ఇక తర్వాతి స్థానాల్లో బ్యాటింగ్ కు వచ్చిన నేపాల్ క్రికెటర్లు చేసిన స్కోర్లు వరుసగా.. 0, 26, 28, 13, 3, 6, 0, 7, 0గా నమోదు అయ్యాయి. కానీ టీమిండియా మ్యాచ్‌కు వచ్చే సరికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పాక్‌తో మ్యాచ్‌లో సింగిల్ డిజిట్ స్కోర్లకు పరిమితమైన కుశాల్, ఆసిఫ్.. భారత పేసర్లు మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్‌ల బౌలింగ్ ను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. ఇందుకు తోడు టీమిండియా ఫీల్డర్ల వైఫల్యం కూడా వారికి కలిసి వచ్చింది.
శ్రేయస్ అయ్యర్, విరాట్ కోహ్లీ సహా వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ మూడు గోల్డెన్ క్యాచ్‌లను డ్రాప్ చేశారు. ఆసిఫ్, కుశాల్ ఇచ్చిన ఈజీ క్యాచ్‌లను కూడా ఈ ముగ్గురు వదిలి పెట్టారు. నేపాల్ ఇన్నింగ్స్ మొదటి, రెండో, ఐదో ఓవర్లో ఈ పొరపాట్లు జరిగాయి. ఈ క్రమంలో లైఫ్ రావడంతో కుశాల్ 3 ఫోర్లు, రెండు సిక్సర్లతో చెలరేగిపోయాడు. అయితే, పదో ఓవర్లో శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో కుశాల్ ఇచ్చిన క్యాచ్‌ను ఇషాన్ కిషన్ పట్టడంలో సక్సెస్ అయ్యాడు.
దీంతో ఎట్టకేలకు టీమిండియాకు తొలి వికెట్ దొరికింది. పదో ఓవర్ ముగిసే సరికి ఒక వికెట్ నష్టానికి నేపాల్ 65 రన్స్ చేసింది. మరోవైపు.. 23 ఓవర్లు ముగిసే సరికి ఆసిఫ్ 7 ఫోర్ల సాయంతో 45 పరుగులు చేసి.. గుల్సన్ ఝాతో కలిసి క్రీజులో ఉన్నాడు. కాగా నేపాల్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ప్రస్తుతం నేపాల్ స్కోర్ 4 వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసింది.