Asia Cup 2023 IND vs PAK Super-4 Match on September 10: ఆసియా కప్ 2023లో పసికూన నేపాల్‌పై విజయం సాధించిన భారత్ సూపర్-4కు అర్హత సాధించింది. డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం లక్ష్యాన్ని 23 ఓవర్లలో 145గా నిర్ణయించగా.. 20.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా ఛేదించింది. ఈ విజయంతో ఆసియా కప్ సూపర్-4కు క్వాలిఫై అయిన భారత్.. మరోసారి దాయాది పాకిస్థాన్‌తో తలపడనుంది. ఆసియా కప్ 2023లో భాగంగా సెప్టెంబర్ 10న భారత్, పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది.
గత శనివారం (సెప్టెంబర్ 2) జరిగిన ఇండో-పాక్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయిన విషయం తెలిసిందే. భారత్ బ్యాటింగ్ అనంతరం వరుణుడు రావడంతో పాక్ ఇన్నింగ్స్‌లో ఒక్క బంతి కూడా పడలేదు. దాంతో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ అసలైన మజాను ఫాన్స్ మిస్ అయ్యారు. సూపర్-4లో భాగంగా దాయాదీ దేశాలు వచ్చే ఆదివారం 10న తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.
షెడ్యూల్ ప్రకారం.. భారత్, పాకిస్తాన్ మ్యాచ్ కొలంబో వేదికగా సెప్టెంబర్ 10న జరగాల్సి ఉంది. అయితే అక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతవారణ శాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ తరలించే అంశంపై ఏసీసీ ఆలోచనలు చేస్తోంది. పల్లెకెలె లేదా దంబుల్లాకు ఇండో-పాక్ మ్యాచ్ తరలించే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ మాత్రమే కాదు సూపర్-4, ఫైనల్ మ్యాచ్ కూడా తరలిపోనున్నాయి. రెండు రోజుల్లో వేదికల తరలింపుపై ఏసీసీ తుది నిర్ణయం వెల్లడించనుంది.