BCCI set to announce India Team for World Cup 2023 Today: 12 ఏళ్ల తర్వాత స్వదేశంలో ఐసీసీ వన్డే ప్రపంచకప్ జరుగనున్న విషయం తెలిసిందే. భారత్ వేదికగా ప్రపంచకప్ 2023 అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు జరగనుంది. మెగా టోర్నీ కోసం ఇప్పటికే చాలా క్రికెట్ బోర్డులు తమ జట్లను ప్రకటించాయి. అయితే ప్రపంచకప్ టోర్నీలో పాల్గొనే భారత జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఈరోజు మధ్యాహ్నం ప్రకటించనుంది. దాంతో భారత జట్టులో ఎవరెవరు ఉంటారో అని ఫాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఆసియా కప్ 2023 కోసం ఎంపిక చేసిన భారత జట్టులో మార్పులు చేసి.. ప్రపంచకప్ 2023 కోసం జట్టును బీసీసీఐ సెలెక్టర్లు ప్రకటిస్తారని తెలుస్తోంది. మెగా టోర్నీ కోసం ఇప్పటికే 15 మంది సభ్యులతో కూడిన జట్టును అజిత్ అగర్కార్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఫైనల్ చేసిందట. ఎన్‌సీఏ తాజాగా నిర్వహించిన ఫిట్‌నెస్ టెస్టులో స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ పాస్ అయ్యాడు. దాంతో ఆసియా కప్‌లో మిగిలిన మ్యాచ్‌లలో ఆడడంతో పాటు ప్రపంచకప్‌కు ఎంపిక కానున్నాడు. అయితే ఆసియా కప్ జట్టులో భాగం అయిన తెలుగు ఆటగాడు తిలక్ వర్మకు చోటు దక్కదని సమాచారం.
కీపర్ సంజూ శాంసన్, పేసర్ ప్రసిద్ద్ కృష్ణకు కూడా ప్రపంచకప్ 2023 జట్టులో చోటు లేదని సమాచారం. బీసీసీఐ సెలక్టర్లు ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆల్‌రౌండర్ శార్ధూల్ ఠాకూర్ స్ధానంలో లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌కు అవకాశం ఇచ్చినట్లు సమాచారం. ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ మెగా టోర్నీకి ఎంపిక కానున్నారు. మరికొద్ది గంటల్లో ప్రపంచకప్ 2023లో ఆడే భారత జట్టు ఏదో తెలియరానుంది.
ప్రపంచకప్‌కు భారత జట్టు (అంచనా):
రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్.