Leading News Portal in Telugu

WC 2023: వరల్డ్ కప్ కు ఇదే ఫైనల్ టీమ్.. మార్పుల్లేవ్..


భారత్ వేదికగా జరుగనున్న వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్ కి బీసీసీఐ ( భారత క్రికెట్‌ నియంత్రణ మండలి ) జట్టును ప్రకటించింది. టీమిండియా సారథి రోహిత్‌ శర్మతో కలిసి బీసీసీఐ చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ ఐసీసీ ఈవెంట్‌ ఆడే 15 మంది సభ్యుల పేర్లను వెల్లడించాడు. టీమిండియా చీఫ్‌ సెలక్టర్‌ అగార్కర్‌ ముందు చెప్పినట్లుగానే ఆసియా వన్డే కప్‌ ఆడుతున్న జట్టు నుంచే వరల్డ్‌కప్‌ టీమ్‌ను ఎంపిక చేశారు.

అందరు ఊహించినట్లుగానే యంగ్ ప్లేయర్స్ పేసర్‌ ప్రసిద్‌ కృష్ణ, హైదరాబాదీ బ్యాటర్‌ తిలక్‌ వర్మతో పాటు సంజూ శాంసన్‌కు మొండిచేయి ఎదురైంది. ఇక యజువేంద్ర చహల్‌కు కూడా ఈ వరల్డ్‌ కప్‌ ఈవెంట్‌లో పాల్గొనే ఛాన్స్ రాలేదు. కాగా, ఈ ప్రొవిజినల్‌ జట్టే ఫైనల్‌ అని, కేవలం గాయాల బెడద ఉంటే తప్ప ఈ జట్టులో ఎలాంటి మార్పులు, చేర్పులు ఉండవని టీమిండియా చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ తేల్చి చెప్పారు. అన్ని కోణాల్లో ఆలోచించిన తర్వాతే ఈ 15 మందిని వరల్డ్ కు ఎంపిక చేసినట్లు క్లారిటి ఇచ్చాడు. కాగా అక్టోబరు 5 నుంచి భారత్‌ వేదికగా వన్డే ప్రపంచకప్ టోర్నమెంట్ ఆరంభం కానుంది.

ఆతిథ్య టీమిండియాతో పాటు ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంక, అఫ్గానిస్తాన్‌, సౌతాఫ్రికా, నెదర్లాండ్స్‌ తదితర పది జట్లు ఈ మెగా ఈవెంట్ లో టైటిల్‌ కోసం తలపడనున్నాయి. ఇక 2011లో స్వదేశంలో జరిగిన ప్రపంచకప్‌లో మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలోని భారత జట్టు ట్రోఫీ గెలిచింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో శ్రీలంకతో జరిగిన ఫైనల్లో సిక్సర్‌తో జట్టును ధోని విజయతీరాలకు చేర్చాడు. తద్వారా 28 ఏళ్ల తర్వాత మరోసారి భారత్‌ ఖాతాలో ఐసీసీ టైటిల్‌ వచ్చి చేరింది. ఈసారి కూడా అదే ఫలితం రిపిట్ కావాలని.. రోహిత్‌ సేన వరల్డ్‌కప్‌ గెలవాలని టీమిండియా అభిమానులు కోరుకుంటున్నారు.