Leading News Portal in Telugu

Asia Cup 2023: సూపర్‌-4 వేదికల్లో మార్పు లేదు.. సెప్టెంబర్ 10న భారత్, పాకిస్తాన్‌ మ్యాచ్!


Asia Cup 2023 Super-4, Final Matches to stay in Colombo: కొలంబోలో భారీ వర్షాల కారణంగా ఆసియా కప్‌ 2023 ‘సూపర్‌-4’ మ్యాచ్‌లు, ఫైనల్‌ వేదికను మార్చే అవకాశం ఉందని జరిగిన చర్చకు తెర పడింది. ముందుగా నిర్ణయించిన ప్రకారమే.. సూపర్‌ 4 మ్యాచ్‌లు, ఫైనల్‌ యధాతథంగా కొలంబోలోనే జరుగనున్నాయి. కొలంబోలో వాతావరణం మెరుగయ్యే సూచనలు కనిపిస్తుండటంతో.. వేదికను మార్చకూడదని మంగళవారం ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ (ఏసీసీ) నిర్ణయించింది.

భారీ వర్షాల కారణంగా సూపర్‌ 4, ఫైనల్‌ మ్యాచ్‌ల్ని కొలంబో నుంచి హంబన్‌టోటాకు తరలించనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే తక్కువ సమయంలో మారుమూల జిల్లా హంబన్‌టోటాకు తరలివెళ్లడంపై అధికారిక ప్రసారదారు తమ ఇబ్బందుల్ని ఏసీసీ వివరించినట్లు తెలిసింది. సమస్యలను తెలుసుకున్న ఏసీసీ.. కొలంబోనే మ్యాచ్‌లు నిర్వహించాలని నిర్ణయించింది. దాంతో సూపర్‌ 4 మ్యాచ్‌లు, ఫైనల్‌ యధాతథంగా కొలంబోలోనే జరుగనున్నాయి.

నేడు పాకిస్థాన్‌-బంగ్లాదేశ్ మధ్య సూపర్‌ 4 మ్యాచ్ మధ్యాహ్నం 3 గంటలకు లాహోర్‌లో జరగనుంది. సూపర్‌–4 దశలో సెప్టెంబర్ 10న పాకిస్తాన్‌తో, 12న శ్రీలంకతో, 15న బంగ్లాదేశ్‌తో భారత్‌ తలపడుతుంది. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ కోసం అందరూ మరోసారి ఎదురుచూస్తున్నారు. దాయాది దేశాల మధ్య సెప్టెంబర్ 2న జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.