Leading News Portal in Telugu

World Cup 2023: అందుకే శార్దుల్, అక్షర్‌లను తీసుకున్నాం: రోహిత్


Rohit Sharma Talks About India Squad for ODI World Cup 2023: నాణ్యమైన జట్టు కోసం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదు అని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. భారత జట్టు గత కొన్నేళ్లుగా లోయర్‌ ఆర్డర్‌లో బలహీన బ్యాటింగ్‌తో సమస్య ఎదుర్కొంటోందని, 8-9వ స్థానంలో కూడా బ్యాటింగ్ చేసేవారు పరుగులు చేయడం అవసరమన్నాడు. జట్టు సమతూకం కోసమే శార్దుల్ ఠాకూర్, అక్షర్‌ పటేల్‌లను తీసుకున్నామని రోహిత్ తెలిపాడు. ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ 2023 కోసం 15 మందితో కూడిన జట్టుని బీసీసీఐ మంగళవారం ప్రకటించిన విషయం తెలిసిందే.

చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌తో కలిసి రోహిత్‌ శర్మ వన్డే ప్రపంచకప్‌ 2023 జట్టును ప్రకటించాడు. అనంతరం రోహిత్ మీడియాతో మాట్లాడుతూ… ‘జట్టు కోసం కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదు. ఈ క్రమంలో కొందరు ఆటగాలకు నిరాశ కలగడం సహజం. జట్టు సమతూకం కోసమే శార్దుల్ ఠాకూర్, అక్షర్‌ పటేల్‌లను తీసుకున్నాం. గత కొన్నేళ్లుగా లోయర్‌ ఆర్డర్‌లో బలహీన బ్యాటింగ్‌ ఉంది. 8, 9వ స్థానాల్లో ఆడేవారు పరుగులు చేయడం అవసరం. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో బ్యాటింగ్‌ లోతు లేని లోటు తెలిసింది. టెయిలెండర్లూ బ్యాటుతో కొన్ని పరుగులు చేయాలి. మేం బౌలర్లలతో మాట్లాడాం. ప్రపంచకప్‌లో ఆ బాధ్యతనూ తీసుకోవాలని చెప్పాం’ అని చెప్పాడు.

‘పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో హార్దిక్‌ పాండ్యా ఆట చూస్తే.. అతడు జట్టుకు ఎంత కీలకమో అర్థమవుతుంది. టోర్నీలో ఫైనల్‌తో కలిపితే 11 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. టీ20లతో పోలిస్తే వన్డేల్లో కోలుకునేందుకు, వ్యూహాలు రూపొందించుకునేందుకు తగినంత సమయం ఉంటుంది. అన్ని రకాలుగా ఈ టీమ్‌ అత్యుత్తమం అని మేం భావిస్తున్నాం. టీమ్‌ ప్రకటించేందుకు ముందు ఎంతో చర్చించాం, ఎంతో ఆలోచింతాం. ఈ జట్టు ఎంపికతో ఎంతో సంతృప్తిగా ఉన్నాం’ అని టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ తెలిపాడు.