Leading News Portal in Telugu

ICC Rankings: కెరీర్ హై రేటింగ్‌కు చేరుకున్న భారత యువ ఆటగాళ్లు!


Shubman Gill moved to No 3 in ODI Rankings with 750 Rating: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత యువ ఆటగాళ్లు శుభ్‌మాన్ గిల్, ఇషాన్ కిషన్ కెరీర్ హై రేటింగ్‌కు చేరుకున్నారు. ఐసీసీ తాజాగా ప్రకటించిన వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో గిల్ మూడో స్థానంలో ఉన్నాడు. భారత ఓపెనర్ ఖాతాలో 750 రేటింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఆసియా కప్‌ 2023లో నేపాల్‌పై తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో గిల్ అజేయంగా 67 పరుగులు చేసిన విషయం తెగెలిసిందే. వన్డే ర్యాంకింగ్స్‌లో గిల్‌కు అత్యధిక రేటింగ్ పాయింట్స్ ఇవే కావడం విశేషం.

పల్లెకెలెలో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ అద్భుత ఇన్నింగ్స్ (82) ఆడాడు. దాంతో 624 రేటింగ్ పాయింట్లతో కెరీర్-బెస్ట్ మార్క్‌ అందుకున్నాడు. బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌ జాబితాలో 12 స్థానాలు ఎగబాకిన ఇషాన్.. 24వ స్థానానికి చేరుకున్నాడు. ఇక బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజామ్ (882) నం.1 ర్యాంక్ నిలబెట్టుకున్నాడు. రాస్సీ వాన్ డెర్ డస్సెన్ (777) రెండో స్థానంలో ఉండగా.. శుభ్‌మాన్ గిల్ మూడో స్థానంలో ఉన్నాడు.

వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా పేసర్ జోష్ హాజిల్‌వుడ్ (705) అగ్రస్థానంలో ఉన్నాడు. మిచెల్ స్టార్క్ (686), మాట్ హేన్రి (667), ట్రెంట్ బౌల్ట్ (660) టాప్ 4లో ఉండగా.. పాకిస్తాన్ పేస్ స్పియర్‌హెడ్ షాహీన్ అఫ్రిది (659) టాప్ -5లోకి వచ్చాడు. ఆసియా కప్ 2023లో రెండు మ్యాచ్‌లలో ఆరు వికెట్లు పడగొట్టడంతో నాలుగు స్థానాలు ఎగబాకి ఐదవ స్థానానికి చేరుకున్నాడు.