Leading News Portal in Telugu

Asia Cup 2023: శ్రీలంక వాతావరణ శాఖ గుడ్ న్యూస్.. ఇక మ్యాచ్లకు ఇబ్బందేమీ లేదు


Asia Cup 2023: శ్రీలంక వేదికగా ఆసియా కప్ మ్యాచ్ లు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే అక్కడ మ్యాచ్ లకు ఓ పెద్ద సమస్య వచ్చి పడింది. మ్యాచ్ మొదటి రోజు నుంచే వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు మ్యాచ్ లకు వర్షం అడ్డంకిగా మారిది. ఇండియా మొదటి మ్యాచ్ పాకిస్తాన్ తో తలపడినప్పుడు వర్షం కారణంగా ఆగిపోయింది. దీంతో మ్యాచ్ రద్దు కాగా.. ఇరు జట్లకు చెరో ఒక పాయింట్ ఇచ్చారు.

ఇప్పటికే శ్రీలంకలో వర్షాలు భారీగా పడుతున్నాయి.. ఈ నేపథ్యంలో శ్రీలంక వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటివరకు వర్షం కారణంగా కొన్ని మ్యాచ్ లు రద్దు అయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటినుంచి జరగబోయే మ్యాచ్ లకు వర్ష ప్రభావం ఏమీ ఉండదని ఓ సీనియర్ అధికారి చెప్పారు. సెప్టెంబర్ 9 తర్వాత వాతావరణం అనుకూలంగా ఉంటుందన్నారు. సెప్టెంబర్ 10న కొలంబో వేదికగా జరిగే సూపర్ ఫోర్ మ్యాచ్‌లో భారత్ పాకిస్థాన్‌తో తలపడనుంది. సెప్టెంబర్ 12న అదే వేదికపై శ్రీలంకతో, ఆ తర్వాత సెప్టెంబర్ 15న బంగ్లాదేశ్‌తో తలపడుతుంది. ఫైనల్ సెప్టెంబర్ 17న జరగనుంది.

సెప్టెంబర్ 9 తర్వాత ఎండ, మేఘావృతంగా ఉంటుందని.. కానీ వర్షం కురిసే ఛాన్స్ తక్కువని చెబుతున్నారు. రాబోయే వారంలో పశ్చిమ ప్రావిన్స్‌లో తక్కువ వర్షాలు పడవచ్చని.. సెప్టెంబర్ 17 నాటికి ఆసియా కప్ ఫైనల్ ఆడే రోజు వర్షాలు తగ్గుముఖం పడతాయని వాతావరణశాఖ అధికారి తెలిపారు.