Leading News Portal in Telugu

Babar Azam: విరాట్ కోహ్లీ ప్రపంచ రికార్డును బ్రేక్ చేసిన బాబర్ ఆజామ్!


Babar Azam Breaks Virat Kohli ODI Record in Asia Cup 2023: పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. వన్డే ఫార్మాట్‌లో తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 2000 పరుగులు పూర్తి చేసిన తొలి కెప్టెన్‌గా నిలిచాడు. ఆసియా కప్‌ 2023లో భాగంగా బుధవారం లాహోర్‌లో బంగ్లాదేశ్‌పై 22 బంతుల్లో 17 పరుగులు చేసిన బాబర్ ఈ రికార్డు తన పేరుపై లిఖించుకున్నాడు. ఈ క్రమంలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రికార్డుని బ్రేక్ చేసాడు. కోహ్లీ 36 ఇన్నింగ్స్‌ల్లో 2000 పరుగులు పూర్తి చేయగా.. బాబర్ 31 ఇన్నింగ్స్‌ల్లోనే ఆ మార్క్ అందుకున్నాడు.

ఈ జాబితాలో దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్ మూడో స్థానంలో ఉన్నాడు. ఏబీ 41 ఇన్నింగ్స్‌లలో 2000 పరుగులు పూర్తి చేశాడు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ (47 ఇన్నింగ్స్‌లు) 4వ స్థానంలో ఉన్నాడు. ఇక 2015లో అరంగేట్రం చేసిన బాబర్ ఇప్పటివరకు 106 వన్డేలు ఆడి 19 సెంచరీలు చేశాడు. పాకిస్థాన్ తరఫున అత్యధిక వన్డే సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో బాబర్ రెండో స్థానంలో ఉన్నాడు. మరో సెంచరీ చేస్తే మాజీ ఓపెనర్ సయీద్ అన్వర్ (20 వన్డే సెంచరీలు) రికార్డును సమం చేస్తాడు.

ఆసియా కప్‌ 2023లో బుధవారం జరిగిన సూపర్‌-4 తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్ 7 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించింది. హారిస్‌ రవూఫ్‌ (4/19), నసీమ్‌ షా (3/34) విజృంభించడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లా 38.4 ఓవర్లలో 193 పరుగులకే ఆలౌట్ అయింది. ముష్ఫికర్‌ రహీమ్‌ (64; 87 బంతుల్లో 5×4), షకిబ్‌ అల్‌హసన్‌ (53; 57 బంతుల్లో 7×4) రాణించారు. స్వల్ప లక్ష్యాన్ని పాక్‌ 39.3 ఓవర్లలో మూడు వికెట్స్ కోల్పోయి ఛేదించింది. ఇమాముల్‌ హక్‌ (78; 84 బంతుల్లో 5×4), మొహ్మద్ రిజ్వాన్‌ (63; 79 బంతుల్లో 7×4, 1×6) హాఫ్ సెంచరీలు చేశారు.