India Batting Coach Makes BIG Statement Ahead Of IND Vs PAK Asia Cup 2023 Super Four Match: ఆసియా కప్ 2023 సూపర్-4లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు సత్తాచాటుతారని భారత్ బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ ధీమా వ్యక్తం చేశారు. భారత ఆటగాళ్లకు పాక్ పేస్ దళాన్ని ఎదుర్కొనే సత్తా ఉందని పేర్కొన్నాడు. ఆసియా కప్ లీగ్ దశలో వర్షం కారణంగా రద్దయిన మ్యాచ్‌లో పాక్ పేసర్ల ధాటికి టీమిండియా టాపార్డర్ 64 పరుగులకే పెవిలియన్ చేరింది. ఈ మ్యాచ్‌లో అన్ని వికెట్లు పేసర్లే (షాహీన్ ఆఫ్రిది 4, హారిస్ రవూఫ్ 3, నసీమ్ షా 3) పడగొట్టారు. సూపర్-4లో దాయాది జట్లు మరోసారి తలపడనున్న నేపథ్యంలో విక్రమ్ రాథోడ్ పాక్ బౌలింగ్ అటాక్ గురించి మాట్లాడాడు.
భారత్ బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ మాట్లాడుతూ… ‘సూపర్-4 మ్యాచ్‌లో మేం మెరుగ్గా బ్యాటింగ్ చేయడానికి ప్రయత్నిస్తాం. గత మ్యాచ్‌లో పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. పాకిస్థాన్‌కు మంచి బౌలింగ్ అటాక్ ఉంది. ముగ్గురు అద్భుత పేసర్లు ఉన్నారు. వారిని భారత బ్యాటర్లు సమర్థంగా ఎదుర్కొలేరని కాదు. కొన్నిసార్లు పరిస్థితులు వారికి అనుకూలంగా ఉండడంతో పైచేయి సాధిస్తారు. మంచి ఆరంభం లభిస్తే.. మా బ్యాటర్లు భారీ స్కోర్లు చేయగలరు’ అని అన్నాడు.
‘పాక్‌పై టాపార్డర్ విఫలమైనా మొదటిసారి ఐదో స్థానంలో బ్యాటింగ్ చేసిన ఇషాన్ కిషన్ బాగా ఆడాడు. మిడిల్ ఆర్డర్‌లో కిషన్, కేఎల్ రాహుల్ రూపంలో ఇద్దరు మంచి ఆటగాళ్లు ఉండటం జట్టుకు కలిసొచ్చే అంశం. పరిస్థితులను బట్టి తుది జట్టు ఉంటుంది. స్పిన్ పిచ్ అయితే అదనపు స్పిన్నర్‌ను తీసుకుంటాం. అక్షర్ పటేల్ మా దృష్టిలో ఉంటాడు’ అని విక్రమ్ రాథోడ్ తెలిపాడు. ఆసియా కప్ సూపర్-4లో భాగంగా సెప్టెంబర్ 10న భారత్, పాక్ తలపడనున్నాయి.