Daniil Medvedev Fires on US Conditions in US Open Tennis 2023: యుఎస్ ఓపెన్ 2203లో వేడి ఉష్ణోగ్రతలు ప్లేయర్లకు పెను సవాలుగా నిలుస్తున్నాయి. వేడి, ఉక్కపోత తట్టుకోలేక ప్లేయర్స్ అనారోగ్యానికి గురవుతున్నారు. అత్యధిక ఉష్ణోగ్రత (35 డిగ్రీల సెల్సియస్)ల మధ్య మ్యాచ్ ఆడిన రష్యా ఆటగాడు డానియల్ మెద్వెదేవ్ అనారోగ్యానికి గురయ్యాడు. క్వార్టర్ ఫైనల్లో ఆట రెండో సెట్‌కు మారే సమయంలో.. అతడు అస్వస్థతకు గురయ్యాడు. వైద్యుడు పరీక్షించిన అనంతరం మెద్వెదెవ్ ఇన్హేలర్ సాయంతో ఆడాడు.
యుఎస్ ఓపెన్ 2203 పరిస్థితులపై మెద్వెదెవ్ అసహనం వ్యక్తం చేశాడు. ఒక ఆటగాడు చనిపోయినా అప్పుడు కూడా వీళ్లు చూస్తూనే ఉంటారు అని మండిపడ్డాడు. మూడవ సెట్ మధ్యలో మెద్వెదేవ్ కెమెరాను చూస్తూ ఇలా చెప్పడం వినిపించింది. ‘ఇక్కడ ఏం జరుగుతుందో మీరు ఊహించలేరు. ఒక ఆటగాడు చనిపోతాడు. అప్పుడు కూడా వీళ్లు చూస్తూనే ఉంటారు. ఈ ప్రమాదకరమైన వాతావరణంలో ఎంత సమయం ఆడగలం?. కానీ ఏం చేయాలనే దానిపై స్పష్టత లేదు’ అని మెద్వెదెవ్ అన్నాడు.
‘4-5 రోజుల పాటు యుఎస్ ఓపెన్ టోర్నీని నిలిపివేయలేం. ఎందుకంటే.. టీవీ ప్రసారాలు, టికెట్లు, ఫాన్స్.. ఇలా అన్నింటిపై ప్రభావం పడుతుంది. తీవ్రమైన ఎండ కారణంగా తొలి సెట్ తర్వాత బంతిని అస్సలు చూడలేకపోయా. తీవ్ర అస్వస్థతకు గురయ్యా’ అని డానియల్ మెద్వెదెవ్ పేర్కొన్నాడు. వేడిని తట్టుకోలేని ప్లేయర్లు మంచు ముక్కలతో నిండిన సంచులను వాడుతున్నారు. మరోవైపు నిర్వాహకులు ట్యూబ్‌ల నుంచి చల్లని గాలిని వదులుతున్నారు. క్వార్టర్ ఫైనల్లో తన దేశానికే చెందిన ఆండ్రీ రుబ్లెవ్‌ను ఓడించిన మెద్వెదెవ్.. నాలుగోసారి సెమీ ఫైనల్లోకి ప్రవేశించాడు.