Leading News Portal in Telugu

Asia Cup 2023: సూపర్-4 మ్యాచ్‌లన్నీ వాష్ అవుట్ అయితే.. ఫైనల్ చేరే జట్లేవో తెలుసా? అస్సలు ఊహించరు


What happens if Asia Cup 2023 Super-4 Matches in Colombo are washed out: ఆసియా కప్‌ 2023లో గ్రూప్ దశ ముగిసి.. సూపర్-4 సాగుతోంది. సూపర్-4 తొలి మ్యాచ్ లాహోర్‌లోని గడ్డాఫీ స్టేడియంలో జరగ్గా.. బంగ్లాదేశ్‌పై పాకిస్తాన్ విజయం సాధించింది. ఇక సూపర్-4లో మిగిలిన 5 మ్యాచ్‌లు శ్రీలంకలోని కోలంబోలో జరగనున్నాయి. సూపర్-4లో భారత్, శ్రీలంక జట్లు మూడేసి మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగా.. పాకిస్తాన్, బంగ్లాదేశ్ జట్లు మాత్రం రెండేసి మ్యాచ్‌లను ఆడుతాయి. అయితే ఈ మ్యాచ్‌లకు వర్షం ముప్పు పొంచి ఉంది.

వచ్చే 10-12 రోజుల పాటు కొలంబోలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అక్కడి వాతావరణ శాఖ తెలిపింది. రుతుపవనాల ఆలస్యం వలన గత రెండు వారాలుగా కొలంబోలో వర్షాలు కురుస్తున్నాయి. వచ్చే రోజుల్లోనూ వాన కురుస్తుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ క్రమంలో ఆసియా కప్‌ 2023 సూపర్-4 మ్యాచ్‌లపై నీలి నీడలు కమ్ముకున్నాయి. సూపర్-4 మ్యాచ్‌లు అన్నింటికీ వర్షం ముప్పు పొంచి ఉంది. దాంతో సూపర్-4 మ్యాచ్‌లన్నీ వాష్ అవుట్ అయితే.. పరిస్థితి ఏంటి?, ఏ జట్లు ఫైనల్స్ చేరతాయి అని క్రికెట్ ఫాన్స్ అనుకుంటున్నారు.

బంగ్లాదేశ్‌పై గెలిచిన పాకిస్తాన్ ఇప్పటికే 2 పాయింట్లు ఖాతాలో వేసుకుంది. ఇక సెప్టెంబర్ 10న భారత్, సెప్టెంబర్ 14న శ్రీలంకతో పాకిస్తాన్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఆ మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దయితే.. ఒక్కో పాయింట్ జాతవ్వడంతో పాకిస్తాన్ ఖాతాలో 4 పాయింట్లు ఉంటాయి. దాంతో పాకిస్తాన్ ఆసియా కప్‌ 2023 ఫైనల్ చేరుకుంటుంది.

సూపర్-4లో బంగ్లాదేశ్ ఆడాల్సిన రెండు మ్యాచ్‌లు వాష్ అవుట్ అయితే ఆ జట్టు ఖాతాలో రెండు పాయింట్స్ చేరుతాయి. మరోవైపు భారత్, శ్రీలంక జట్లు ఆడాల్సిన మూడు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దయితే.. ఇరు జట్ల ఖాతాలలో మూడేసి పాయింట్ల చేరతాయి. నెట్ రన్ రేట్ కూడా భారత్, లంకలకు సమంగా ఉంటుంది. గ్రూప్ దశ పాయింట్లను సూపర్-4లో పరిగణించరు. దీంతో భారత్‌, శ్రీలంక ఫైనల్‌లో చోటు కోసం పోటీ పడనున్నాయి. ఈ సమయంలో టాస్ ద్వారా ఫైనల్ చేరే జట్టును నిర్ణయిస్తారు. భారత్, శ్రీలంక జట్ల మధ్య టాస్ గెలిచిన జట్టు పాకిస్తాన్‌తో ఫైనల్ మ్యాచ్ ఆడుతుంది.