Leading News Portal in Telugu

IND vs PAK: అభిమానులకు గుడ్ న్యూస్.. కొలంబో స్టేడియంలో ప్రత్యక్షమైన సూర్యుడు!


Sun is shining at Colombo Stadium ahead of IND vs PAK MAtch: ఆసియా కప్‌ 2023లో నేడు కీలక పోరు జరగనుంది. సూపర్-4లో భాగంగా దాయాదులు భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ నేటి మధ్యాహ్నం 3 గంటలకు ఆరంభం కానుంది. కొలంబో వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌కు వరుణుడు ముప్పు పొంచి ఉంది. గ్రూప్‌ స్టేజ్‌లో ఇండో-పాక్ మధ్య మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే. దాంతో ఈ మ్యాచ్‌నైనా పూర్తిగా చూస్తామా? లేదా? అనే సందిగ్ధత అభిమానుల్లో నెలకొంది. ఈ నేపథ్యంలో అభిమానులకు గుడ్ న్యూస్.

భారత్, పాకిస్తాన్ మ్యాచ్ జరగనున్న కొలంబోలో ప్రస్తుతం వర్షం ఆగిపోయినట్లు తెలుస్తోంది. కొలంబోలో సూర్యుడు ప్రకాశిస్తున్నాడట. మ్యాచ్ జరిగే ప్రేమదాస స్టేడియం సమీపంలో ఎండ కాస్తోందట. మ్యాచ్ జరిగేందుకు ఇప్పుడు అనుకూల వాతావరణం ఉంది. ఇదే కంటిన్యూ అయితే ఇండో-పాక్ మ్యాచ్ సజావుగా సాగనుంది. అయితే మ్యాచ్ మొదలయ్యే సమయానికి వాతవరణం ఎలా ఉంటుందో చూడాలి.

ఆసియా కప్‌ 2023 సూపర్-4లో విజేతలుగా నిలిచే రెండు జట్లు ఫైనల్‌కు చేరుకుంటాయన్న విషయం తెలిసిందే. టీమిండియాకు ఇదే మొదటి మ్యాచ్ కాగా.. పాకిస్తాన్ ఇప్పటికే ఓ మ్యాచ్ ఆడి గెలిచింది. పాక్ ప్రస్తుతం ఫైనల్ రేసులో ముందంజలో ఉంది. ఫైనల్ చేరాలని చూస్తోన్న భారత్‌ను వర్షం వెంటాడుతూనే ఉంది. పాయింట్లు, రన్‌రేట్‌ కీలకం కాబట్టి వరుణుడు టీమిండియాను ముంచుతాడో లేదా ఒడ్డున పడేస్తాడో చూడాలి.