Leading News Portal in Telugu

US Open Tennis 2023: యూఎస్‌ ఓపెన్‌ ఛాంపియన్‌గా అమెరికన్‌ టీనేజర్‌!


Coco Gauff Wins US Open Tennis 2023 Title: యూఎస్ ఓపెన్ 2023 విజేతగా అమెరికన్‌ టీనేజర్‌ కోకో గాఫ్ నిలిచింది. ఆర్థర్ యాష్ స్టేడియం కోర్టులో శనివారం జరిగిన ఫైనల్లో బెలారస్‌కు చెందిన అరీనా సబలెంకాపై 2-6, 6-3, 6-2 తేడాతో విజయం సాధించింది. దాంతో 19 ఏళ్ల గాఫ్ తొలి గ్రాండ్‌స్లామ్‌ను తన ఖాతాలో వేసుకుంది. 2 గంటల 6 నిమిషాల పాటు సాగిన హోరాహోరీ పోరులో సబలెంకపై తొలి సెట్‌ను కోల్పోయినప్పటికీ.. అద్భుతంగా పుంజుకున్న గాఫ్‌ విజేతగా నిలవడం విశేషం.

యూఎస్ ఓపెన్ విజేతగా నిలిచిన అనంతరం కోకో గాఫ్ భావోద్వేగానికి గురైంది. ఈ అనుభవాన్ని మాటల్లో వర్ణించలేనని పేర్కొంది. కోకో గాఫ్ మాట్లాడుతూ… ‘నాకు షాకింగ్‌గా ఉంది. ఈ అనుభవం మాటల్లోని వర్ణించలేను. గతేడాది ఫ్రెంచ్‌ ఓపెన్‌, వింబుల్డెన్‌లో ఓడిపోవడంతో తట్టుకోలేకపోయా. యూఎస్ ఓపెన్ 2023లో ఛాంపియన్‌గా నిలవడంతో అన్నింటినీ మరిచిపోయేలా చేసింది. నా సత్తాపై నమ్మకం లేని వారందరికీ ధన్యవాదాలు చెబుతున్నా. ఈ విజయంలో మా నాన్న ప్రోద్బలం ఎంతో ఉంది’అని కోకో గాఫ్‌ తెలిపింది.

గత జులైలో వింబుల్డెన్‌ 2023 తొలి రౌండ్‌లోనే నిష్క్రమించిన పట్టిన 19 ఏళ్ల కోకో గాఫ్.. ఇప్పుడు విజేతగా నిలవడం గమనార్హం. అమెరికా తరఫున యూఎస్ ఓపెన్‌ను గెలిచిన మూడో టీనేజర్‌గా గాఫ్ నిలిచింది. అంతకుముందు అస్టిన్‌, సెరెనా విలియమ్స్‌ అతిచిన్న వయసులో యూఎస్ ఓపెన్‌ను గెలిచారు. యూఎస్ ఓపెన్‌ గెలిచిన గాఫ్ పై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది.