Rain Threat to India vs Pakistan Asia Cup 2023 Super-4 Match on Reserve Day: ఆసియా కప్ 2023ని వర్షం వెంటాడుతూ ఉన్న విషయం తెలిసిందే. గ్రూప్ దశలో వర్షం కారణంగా కొన్ని మ్యాచ్‌లు రద్దు కాగా.. సూపర్-4 మ్యాచ్‌లను కూడా వరుణుడు వదలడం లేదు. సూపర్-4లో భాగంగా ఆదివారం జరగాల్సిన భారత్-పాకిస్తాన్ మ్యాచ్ వర్షం కారణంగా రిజర్వ్ డే (సెప్టెంబర్ 11)కు వాయిదా పడింది. సోమవారం మిగిలిన మ్యాచ్ జరగనుంది. అయితే రిజర్వ్ డే రోజున మ్యాచ్ సాఫీగా సాగుతుందా? అంటే చెప్పలేని పరిస్థితి నెలకొంది.
కొలొంబో వాతావరణ శాఖ ప్రకారం సోమవారం భారత్-పాకిస్తాన్ మ్యాచ్ జరిగే ఆర్ ప్రేమదాస స్టేడియంలో వర్షం కురిసే అవకాశం ఉంది. 99 శాతం వర్షం పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఓ సమయంలో చిరు జల్లులు, భారీ వర్షం కురిసే అవకాశం ఉందట. దాంతో రిజర్వ్ డే రోజున మ్యాచ్ సాఫీగా సాగే అవకాశాలు తక్కువ. సోమవారం కనీసం 20 ఓవర్ల ఆట సాధ్యమైతే.. పాక్ బ్యాటింగ్ చేయనుంది. ఎందుకంటే ఇప్పటికే భారత్ 24 ఓవర్లు ఆడేసింది. డక్‌వర్త్ లూయిస్ నియమం ప్రకారం.. ఫలితం తేలాలంటే.. ఒక్కో జట్టు 20 ఓవర్లు ఆడాల్సి ఉంటుందన్న విషయం తెలిసిందే.
ఇక భారత్‌ను ‘రిజర్వ్ డే’ బ్యాడ్ లక్ కలవరపెడుతుంది. రిజర్వ డే రోజు పాక్‌పై భారత్ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. మరోవైపు 2019 వన్డే ప్రపంచకప్‌లో భారత్ చివరిసారిగా ‘రిజర్వ్ డే’ రోజున మ్యాచ్ ఆడింది. మాంచెస్టర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన ప్రపంచకప్ సెమీ ఫైనల్స్‌లో కివీస్ చేతిలో భారత్ ఓడిపోయింది. దాంతో రిజర్వ డే బ్యాడ్ లక్ రోహిత్ సేనకు కలవరపెడుతోంది. భారత్ ఈ సమస్యను అధిగమించాలని ఫాన్స్ కోరుకుంటున్నారు.