Leading News Portal in Telugu

BHA vs PAK: శ్రేయాస్ అయ్యర్‌కు నిజంగానే ఫిట్‌నెస్‌ సమస్యలా?.. లేదా ఆ సాకుతో పక్కన పెట్టారా?


BCCI Fired on Iyer for KL Rahul in BHA vs PAK Match: వెన్ను గాయంతో ఆరు నెలల పాటు క్రికెట్‌కు దూరమైన టీమిండియా స్టార్ పేసర్ శ్రేయస్‌ అయ్యర్‌ ఇటీవలే కోలుకుని ఆసియా కప్‌ 2023తో పునరాగమనం చేసిన సంగతి తెలిసిందే. ఆసియా కప్‌లో రెండు మ్యాచ్‌లు ఆడేసరికే.. అయ్యర్‌కు మళ్లీ ఫిట్‌నెస్‌ సమస్యలు తలెత్తాయి. వెన్ను నొప్పి కారణంగా అతడు ఆదివారం పాకిస్థాన్‌తో సూపర్‌-4 మ్యాచ్‌కు దూరం అయ్యాడు. శ్రేయస్‌తో పాటే జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ)లో ఉండి.. గాయం నుంచి కోలుకున్న స్టార్ బ్యాటర్ కేఎల్‌ రాహుల్‌ జట్టులోకి వచ్చాడు.

శ్రేయస్ అయ్యర్ వెన్ను నొప్పితో బాధ పడుతున్నాడని, అతడి స్థానంలో కేఎల్ రాహుల్ ఆడుతున్నడని టాస్ సమయంలో భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు. అయితే దీనిపై చాలా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గ్రూప్ దశలో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అయ్యర్ 13 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ ముందు తనకు ఎటువంటి వెన్ను నొప్పి లేదని చెప్పాడు. ఇక నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్ రాకున్నా.. 50 ఓవర్ల పాటు బాగానే ఫీల్డింగ్ చేశాడు. సూపర్ 4 మ్యాచ్‌కు ముందు అయ్యర్ ప్రాక్టీస్ కూడా చేశాడు. అయితే పాక్ మ్యాచ్ ఆరంభానికి ముందు రోహిత్ వెన్ను నొప్పి కారణంగా అయ్యర్ ఆడటం లేదని ప్రకటించాడు.

శ్రేయస్ అయ్యర్ స్థానంలో కేఎల్ రాహుల్‌ను తుది జట్టులోకి తీసుకున్నామని ప్రకటిస్తే.. ఫాన్స్, మాజీల నుంచి తీవ్ర విమర్శలు ఎదురవుతాయని భయపడిన భారత మేనేజ్మెంట్ గాయం సాకు చెప్పిందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒకవేళ అయ్యర్ నిజంగానే వెన్ను గాయంతో బాధపడుతున్నట్లయితే ప్రపంచకప్ 2023కి ముందు టీమిండియాకు చేదు వార్తే అని చెప్పాలి. రాహుల్, అయ్యర్ ఇద్దరూ ప్రపంచకప్‌ సమయానికి ఎంతవరకు ఫిట్‌గా ఉంటారన్నది ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది.