Leading News Portal in Telugu

Virat Kohli: నేను చాలా అలసిపోయాను.. ప్లీజ్ ఎక్కువ ప్రశ్నలు అడగకండి: విరాట్ కోహ్లీ


Virat Kohli Interview Goes Viral after Asia Cup 2023 IND vs PAK Match: ఆసియా కప్‌ 2023 సూపర్‌-4 మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై భారత్‌ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. కొలంబో వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో 228 పరుగుల తేడాతో పాక్‌ను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్, ఆపై బౌలింగ్‌లో రాణించి దయాది పాకిస్తాన్‌కు భారత్ పవర్‌ ఎంటో చూపించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్‌ కోహ్లీ సెంచరీతో చెలరేగాడు. 94 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 122 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అద్భుత ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీకే ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.

మ్యాచ్ అనంతరం విరాట్‌ కోహ్లీ మాట్లాడుతూ.. తాను చాలా అలసిపోయానని, ఇంటర్వ్యూ ఎక్కువగా ఉండేలా చూడండి అని మీడియాను కోరాడు. ‘ఇంటర్వ్యూ చిన్నదిగా ఉండేలా చూడండి. ఎందుకంటే నేను చాలా అలసిపోయాను. నేను జట్టుకు సహాయపడేందుకు ఎప్పుడూ అన్ని విధాలుగా సిద్ధంగా ఉంటాను. ఈ రోజు కేఎల్‌ రాహుల్‌ మంచి ఆరంభం ఇచ్చాడు. నా పని కేవలం స్ట్రైక్‌ రొటేట్‌ చేయడమే. సులభంగా పరుగులు రాబట్టడం సంతోషంగా ఉంది. నేను కొట్టిన రివర్స్‌ ర్యాంప్‌ బౌండరీపై నాకు గౌరవం ఉంది. ఎందుకంటే సెంచరీ తర్వాత ఆ షాట్ ఆడాను’ అని అన్నాడు.

‘కేఎల్‌ రాహుల్‌తో నా భాగస్వామ్యం చాలా గొప్పది. ఇది టీమిండియాకు మంచి సంకేతం. రాహుల్ వన్డే క్రికెట్‌లో గొప్పగా పునరాగమనం చేయడం ఎంతో ఆనందం కలిగించే విషయం. రేపు మధ్యాహ్నం 3 గంటలకు శ్రీలంకతో మ్యాచ్‌ ఉంది. అదృష్టవశాత్తు మేం టెస్టు ప్లేయర్లం. నేను 100కు పైగా టెస్టులు ఆడాను. కాబట్టి మరుసటి రోజు తిరిగి వచ్చి ఎలా ఆడాలో తెలుసు. నవంబర్‌లో నాకు 35 ఏళ్లు వస్తాయి. కాబట్టి నేను కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి (నవ్వుతూ). గ్రౌండ్స్‌మెన్‌లకు పెద్ద కృతజ్ఞతలు. వర్షం పడినా కూడా వారు మైదానాన్ని బాగా సిద్ధం చేశారు’ అని విరాట్ కోహ్లీ తెలిపాడు.