Pakistan Player Agha Salman to miss Sri Lanka Match: ఆసియా కప్ 2023 సూపర్-4లో భాగంగా భారత్‌తో జరిగిన మ్యాచ్ దాయాది పాకిస్తాన్ జట్టుకి ఏ మాత్రం కలిసి రాలేదు. వరుస గాయాలు ఆ జట్టుని వెంటాడుతున్నాయి. టీమిండియా బ్యాటింగ్ సమయంలో పాక్ స్టార్ పేసర్లు హ్యారీస్ రవూఫ్, నసీం షా గాయపడి ఆటకు దూరం అయ్యారు. ఇక పాక్ బ్యాటింగ్ సమయంలో ఆల్‌రౌండర్ ఆఘా సల్మాన్ గాయపడ్డాడు. భారత బౌలర్ రవీంద్ర జడేజా వేసిన బంతి సల్మాన్ ముఖానికి బలంగా తాకింది.
ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ 357 పరగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగింది. 77 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన సమయంలో ఆఘా సల్మాన్ క్రీజులోకి వచ్చాడు. పాక్ ఇన్నింగ్స్‌ను సల్మాన్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. అయితే భారత స్పిన్నర్లు వరుసగా బౌలింగ్ చేస్తుండడంతో హెల్మట్ తీసి ఆడాడు. ఇన్నింగ్స్ 21 ఓవర్ రవీంద్ర జడేజా వేయగా.. ఓ బంతిని సల్మాన్ స్వీప్ షాట్ ఆడాడు. బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకుని.. అతడి ముఖానికి బలంగా తాకింది.
ఆఘా సల్మాన్ కంటి కింద గాయం అయి రక్తం వచ్చింది. మైదానంలో కాసేపు సల్మాన్ నొప్పితో విలవిల్లాడాడు. భారత బ్యాటర్ కేఎల్ రాహుల్ అతడు వద్దకు వెళ్లి గాయాన్ని పరిశీలించాడు. ఈ లోగా పాక్ ఫిజియో వచ్చి కంకషన్ టెస్టు చేశాడు. సల్మాన్ గాయం అంతతీవ్రమైనది కాకపోవడంతో.. అతను ఆటను కొనసాగించాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ మ్యాచ్‌లో సల్మాన్ 32 బంతులు ఎదుర్కొని 2 ఫోర్ల సాయంతో 23 రన్స్ చేశాడు.