Leading News Portal in Telugu

PAK vs SL: భారత్‌తో మ్యాచ్‌ తర్వాత బాగా నిరుత్సాహ పడ్డాం: మోర్నే మోర్కెల్‌


Missing Naseem Shah a big blow Says Pakistan Bowling Coach Morne Morkel: ఆసియా కప్‌ 2023 గ్రూప్‌-4లో భాగంగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ చిత్తుచిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. భారత్ నిర్ధేశించిన 357 పరుగుల లక్ష్య ఛేదనలో 32 ఓవర్లలో 128 పరుగులకే ఆలౌట్ అయి.. ఏకంగా 228 పరుగుల తేడాతో ఓడింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 2 వికెట్ల నష్టానికి 356 ట్రాన్స్ చేసింది. భారత బ్యాటర్లు విరాట్‌ కోహ్లీ (122 నాటౌట్‌; 94 బంతుల్లో 9×4, 3×6), కేఎల్‌ రాహుల్‌ (111 నాటౌట్‌; 106 బంతుల్లో 12×4, 2×6) సెంచరీలతో చెలరేగగా పాక్ స్పిన్నర్లు తేలిపోయారు. ఈ ఓటమిపై పాక్ బౌలింగ్‌ కోచ్‌ మోర్నే మోర్కెల్‌ స్పందించాడు. భారత్‌తో మ్యాచ్‌ తర్వాత తాము నిరుత్సాహ పడ్డాం అని తెలిపాడు.

తమ స్పిన్నర్లు శ్రీలంకతో మ్యాచ్‌లో పుంజుకొంటారని మోర్నే మోర్కెల్‌ విశ్వాసం వ్యక్తం చేశాడు. శ్రీలంకతో మ్యాచ్‌కు ముందు మోర్కెల్‌ మాట్లాడుతూ… ‘కొలంబో మైదానంలో పరిస్థితులు స్పిన్‌కు అనుకూలంగా ఉన్నాయి. ఇప్పుడు మా స్పిన్నర్లు బాగా రాణిస్తారని భావిస్తున్నా. జట్టుకు అవసరం ఉన్నప్పుడు బాధ్యతలు స్వీకరించడానికి వారు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. అందరూ మ్యాచ్‌ విన్నర్లు కాబట్టి.. ఎలా పుంజుకోవాలో వారికి బాగా తెలుసు. భారత్‌తో మ్యాచ్‌ తర్వాత మేం బాగా నిరుత్సాహ పడ్డాం. బౌలర్లు ఆత్మవిమర్శ చేసుకోవడం చాలా అవసరం. ఎక్కడ తప్పుచేశారో తెలుసుకొని ముందుకువెళ్లాలి. భారత బ్యాటర్లకే పూర్తి క్రెడిట్‌ దక్కుతుంది. ప్రపంచకప్‌నకు ముందు ఇది మాకో గుణపాఠం నేర్పింది’ అని తెలిపాడు.

‘శ్రీలంకతో మ్యాచ్‌కు స్టార్‌పేసర్‌ నసీమ్‌ షా అందుబాటులో లేకపోవడం మాకు పెద్ద ఎదురు దెబ్బే. అయితే కొత్తగా జట్టులోకి వచ్చే వారికి ఇదో అద్భుతమైన అవకాశం. వారు రాణిస్తారనే నమ్మకం ఉంది. భారత్‌ చేతిలో ఓడిపోవడంతో.. ఫైనల్ చేరాలంటే శ్రీలంకపై కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి. ప్లేయర్స్ ఎలా ఆడతారో చూడాలని ఉత్కంఠగా ఉంది’ అని పాక్ బౌలింగ్‌ కోచ్‌ మోర్నే మోర్కెల్‌ అన్నాడు. నసీమ్‌ షా స్థానంలో యువ బౌలర్‌ జమాన్‌ ఖాన్‌ జట్టులోకి వచ్చాడు. అతడు నేటి మ్యాచ్ ఆడనున్నాడు. కొలంబోని ప్రేమదాస మైదానంలో ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది.