Leading News Portal in Telugu

PAK vs SL: ఆకాష్ చెప్పినట్టే సూపర్‌-4 మ్యాచ్‌లో పాక్‌ ఓటమి.. ఆసియా కప్‌ ఫైనల్‌కు శ్రీలంక!


Sri Lanka Enters Asia Cup 2023 Final after defeat Pakistan: గురువారం హోరాహోరీగా సాగిన ఆసియా కప్‌ 2023 ‘సూపర్‌-4’ మ్యాచ్‌లో శ్రీలంక 2 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. డక్‌వర్త్‌-లూయిస్‌ విధానంలో లక్ష్యాన్ని 42 ఓవర్లలో 252 పరుగులకు సవరించగా.. శ్రీలంక 8 వికెట్లు కోల్పోయి చివరి బంతికి విజయం సాధించింది. లంక బ్యాటర్లు కుశాల్‌ మెండిస్‌ (91; 87 బంతుల్లో 8×4, 1×6), అసలంక (49 నాటౌట్‌; 47 బంతుల్లో 3×4, 1×6) అద్భుత ఇన్నింగ్స్ ఆడారు. ఇక ఆసియా కప్‌ ఫైనల్‌లో భారత్‌ను శ్రీలంక ఢీ కొడుతుంది.

వర్షం కారణంగా టాస్ ఆలస్యం అయింది. వర్షం తగ్గాక అంపైర్లు ఓవర్లను కుదించారు. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌ చేసిన పాకిస్తాన్‌ 42 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 252 రన్స్ చేసింది. మొహమ్మద్‌ రిజ్వాన్‌ (86 నాటౌట్‌; 73 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), అబ్దుల్లా షఫీక్‌ ( 52; 69 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఇఫ్తికార్‌ అహ్మద్‌ (47; 40 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్‌ ఆడారు. ఓ దశలో పాక్ 130కే 5 వికెట్స్ కోల్పోగా.. రిజ్వాన్, ఇఫ్తికార్‌ ఆరో వికెట్‌కు 108 పరుగులు జోడించి ఆదుకున్నారు. దాంతో పాక్ మెరుగైన స్కోర్ చేసింది. పతిరన మూడు వికెట్లు తీయగా.. ప్రమోద్‌ మదుశాన్‌ రెండు వికెట్లు పడగొట్టాడు.

అనంతరం శ్రీలంక లక్ష్యాన్ని డక్‌వర్త్‌ లూయిస్‌ ద్వారా 42 ఓవర్లలో 252 పరుగులుగా అంపైర్లు నిర్దేశించారు. లంక 8 వికెట్లు కోల్పోయి చివరి బంతికి 252 రన్స్ చేసింది. కుశాల్‌ మెండిస్‌, సదీరా సమరవిక్రమ (48; 51 బంతుల్లో 4 ఫోర్లు), అసలంక జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. చివరి ఓవర్లో లంకకు 8 పరుగులు అవసరం కాగా.. తొలి 3 బంతుల్లో 2 పరుగులే వచ్చాయి. నాలుగో బంతికి మదుశాన్‌ రనౌటయ్యాడు. ఐదవ బంతికి అసలంక ఫోర్‌ కొట్టి ఉత్కంఠకు కాస్త తెరదించాడు. ఇక చివరి బంతికి అసలంక 2 పరుగులు తీయడంతో లంక సంబరాల్లో మునిగిపోయింది.

ఈ విజయంతో శ్రీలంక 4 పాయింట్లతో సూపర్‌-4 దశలో రెండో స్థానంలో నిలిచి.. ఆసియా కప్‌ 2023 ఫైనల్‌ చేరింది. సూపర్‌-4 ఆడిన పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ నిష్క్రమించాయి. ఈ టోర్నీలో 11వ సారి లంక ఫైనల్లోకి దూసుకెళ్లింది. పాకిస్తాన్, శ్రీలంకపై గెలిచిన భారత్ ఇప్పటికే ఫైనల్ చేరిన విషయం తెలిసిందే. ఇక నేడు బంగ్లాతో రోహిత్ సేన నామమాత్రపు మ్యాచ్ ఆడనుంది. భారత్-పాకిస్తాన్‌ ఫైనల్లో తలపడటం ఆసియా కప్‌ చరిత్రలోనే లేదని, ఈసారి కూడా అదే జరుగుతుందని భారత మాజీ ఓపెనర్‌ ఆకాశ్‌ చోప్రా చేపినట్టే జరిగింది.