Leading News Portal in Telugu

IND vs BAN: బంగ్లాదేశ్‌తో భారత్‌ మ్యాచ్‌.. ముగ్గురు స్టార్ ప్లేయర్స్ అవుట్! శ్రేయస్‌, సూర్య ఇన్


Asia Cup 2023 India vs Bangladesh Preview and Playing 11: పాకిస్థాన్‌పై అద్భుత విజయం సాదించిన శ్రీలంక ఆసియా కప్‌ 2023 ఫైనల్ చేరింది. అంతకుముందు సూపర్‌-4లో పాకిస్థాన్‌, శ్రీలంకపై విజయాలతో భారత్ ఫైనల్ చేరిన విషయం తెలిసిందే. నామమాత్రమైన మ్యాచ్‌లో భారత్‌ నేడు బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ ప్రయోగాలు చేసే అవకాశముంది. పని భారం దృష్ట్యా కీలక ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చి.. మిగతా క్రికెటర్లను పరీక్షించే అవకాశం ఉంది. సూపర్‌-4లో పాక్‌, శ్రీలంకపై ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓడిన బంగ్లాదేశ్‌.. గెలుపుతో టోర్నీని ముగించాలనే పట్టుదలతో ఉంది. దాంతో బంగ్లాను తేలిగ్గా తీసుకుంటే భారత్ మూల్యం చెల్లించక తప్పదు.

ఆదివారం జరిగే ఆసియా కప్‌ 2023 ఫైనల్ మ్యాచ్‌ కోసం జట్టులోని కీలక ప్లేయర్స్‌కు రెస్ట్ ఇవ్వాలని టీమిండియా మేనేజ్‌మెంట్ భావిస్తోందట. వెన్ను నొప్పితో సూపర్‌- 4లో రెండు మ్యాచ్‌లకూ దూరమయిన శ్రేయస్‌ అయ్యర్ బంగ్లాపై ఆడే అవకాశముంది. శ్రేయస్‌ వస్తే ఇషాన్‌ కిషన్‌ బయటకు వెళ్లక తప్పదు. మరోవైపు విరాట్ కోహ్లీకి విశ్రాంతినిచ్చి.. సూర్యకుమార్‌ యాదవ్‌ను ఆడించే సూచనలూ ఉన్నాయి. పునరాగమనంలో పాకిస్థాన్‌పై సెంచరీ చేసిన కేఎల్‌ రాహుల్‌ కొనసాగనున్నాడు.

ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా వరుస మ్యాచ్‌లు ఆడటంతో అతడికి పని భారం ఎక్కువైందని మేనేజ్‌మెంట్ భావిస్తోంది. అతడి స్థానంలో
శార్దూల్‌ ఠాకూర్ ఆడే అవకాశం ఉంది. పేస్ బౌలింగ్‌ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా, మొహ్మద్ సిరాజ్‌కు రెస్ట్ ఇచ్చి.. మొహ్మద్ షమీ, ప్రసిద్ధ్ కృష్ణని ఆడించే అవకాశం ఉంది. మరోవైపు ఈ టోర్నీలో అఫ్గానిస్తాన్‌పై మ్యాచ్‌ గెలవడం మినహా.. బంగ్లాదేశ్‌ ఏ రకంగానూ ఆకట్టుకోలేకపోయింది. కెప్టెన్‌ షకీబ్‌ సహా ఏ ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. దాంతో టీమిండియాకు బంగ్లా ఏ మేరకు పోటీ ఇస్తుందో చూడాలి.

భారత్ తుది జట్టు (అంచనా) (IND vs BAN Playing 11):
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమీ, ప్రసిద్ధ్ కృష్ణ.