Leading News Portal in Telugu

Asia Cup Final: ఆసియా కప్‌ అంటేనే రెచ్చిపోతున్న శ్రీలంక.. ఏకంగా 12 సార్లు ఫైనల్‌కు! భారత్‌ మాత్రం..


Sri Lanka qualified 12th Asia Cup Final: ఆసియా కప్‌ అంటేనే శ్రీలంక క్రికెట్ జట్టు రెచ్చిపోతుంది. ఎక్కడా లేని ఉత్సాహంతో బరిలోకి భారత్, పాకిస్తాన్ లాంటి పటిష్ట జట్లను కూడా ఓడిస్తుంది. పిచ్ ఎలా ఉన్నా, పరిస్థితులు ఎలా ఉన్నా తమకు అనుకూలంగా మార్చుకుంటూ దూసుకుపోతుంది. ఇందుకు నిదర్శనమే గురువారం పాక్‌తో జరిగిన మ్యాచ్. వర్షం వెంటాడినా, భారీ లక్ష్యం ముందున్నా, భీకర పేసర్లు ప్రత్యర్థి జట్టులో ఉన్నా.. చివరి బంతి వరకూ పోరాడి అనూహ్య విజయం సాధించింది. ఆసియా కప్‌ 2023లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ హోదాలో బరిలోకి దిగి మరోసారి ఫైనల్‌కు చేరింది. ఆదివారం భారత్‌తో జరిగే ఫైనల్‌లో అమితుమీ తేల్చుకోనుంది.

ఆసియా కప్‌ 2023లో ఇప్పటివరకూ ఐదు మ్యాచ్‌లు ఆడిన శ్రీలంక ఒక్క టీమిండియాపైనే ఓడింది. నాలుగు విజయాలతో ఫైనల్‌కు చేరింది. లీగ్‌ దశలో బంగ్లాదేశ్, అఫ్గాన్‌లపై విజయాలు అందుకున్న లంక.. సూపర్‌-4లో పాక్, బంగ్లాపై విజయాలతో ఫైనల్‌కు దూసుకెళ్లింది. అయితే సూపర్‌-4 బెర్త్‌ కోసం అఫ్గాన్‌తో పోరాడిన తీరు అద్భుతం. చివరి వరకూ గెలుపు అవకాశాలు అఫ్గాన్‌కే ఉన్నా.. పట్టు వదలకుండా పోరాడి 2 పరుగుల స్వల్ప తేడాతో గెలిచింది. లంక నిర్దేశించిన 292 పరుగుల లక్ష్యాన్ని 37.1 ఓవర్లో ఛేదిస్తే.. రన్‌రేట్‌ ప్రకారం అఫ్గాన్‌ సూపర్‌-4కు చేరుకుంటుంది. అయితే అఫ్గాన్‌ 37 ఓవర్లకు 289/8తో నిలిచింది.

సూపర్‌-4లో పాక్‌పై అద్భుత విజయాన్ని నమోదు చేసిన శ్రీలంక ఏకంగా 12వ సారి ఆసియా కప్‌ ఫైనల్‌కు చేరింది. ఇన్నిసార్లు ఫైనల్‌కు చేరడం టీమిండియాకు కూడా సాధ్యం కాలేదు. ఆసియా కప్‌లో భారత్ ఇప్పటివరకు 11 సార్లు ఫైనల్స్ చేరి.. 7 సార్లు టైటిల్‌ విజేతగా నిలిచింది. మరోవైపు ఇప్పటివరకు 11 ఫైనల్స్ ఆడిన లంక.. ఆరు సార్లు విన్నర్‌గా.. ఆరుసార్లు రన్నరప్‌గా నిలిచింది. 2023 ఫైనల్లో టీమిండియాను ఎదుర్కోవాల్సి ఉంది. సెప్టెంబర్ 17న కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో భారత్‌ vs శ్రీలంక ఫైనల్‌ మ్యాచ్‌ ఆడుతాయి.