Leading News Portal in Telugu

IND vs BAN: శుభ్‌మ‌న్ గిల్ సెంచ‌రీ.. 6 వికెట్లు కోల్పోయిన భారత్..!


టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల న‌ష్టానికి 265 రన్స్ చేసింది. బంగ్లాదేశ్ బ్యాటర్లలో ష‌కీల్ అల్ హ‌స‌న్ (80 ), తౌహిద్ హృదయ్ (54 ) రాణించగా నసుమ్ అహ్మద్(44 ) ప‌ర్వాలేద‌నిపించాడు. శార్దూల్ ఠాకూర్ మూడు వికెట్లు తీయ‌గా, మహ్మద్ షమీ రెండు, అక్షర్ పటేల్, ర‌వీంద్ర జ‌డేజా, ప్రసిద్ కృష్ణలు త‌లా ఓ వికెట్ తీసుకున్నారు. సెకండ్ ఇన్సింగ్స్ ప్రారంభించిన భారత జట్టు ఆదిలోనే కెప్టెన్ రోహిత్ శర్మ వికెట్ కోల్పోయింది. దీంతో టీమిండియా తడబడు స్టార్ట్ అయింది. ఇప్పటికే కీలకమైన వికెట్లను భారత జట్టు చేజార్చుకుంది. దీంతో టీమిండియా ఓపెనర్ శుభ్ మన్ గిల్ సూపర్ సెంచరీతో జట్టుకు ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఓ వైపు వికెట్లు పడుతున్న గిల్ మాత్రం నిలకడగా బ్యాటింగ్ చేస్తూ.. జట్టు స్కోర్ బోర్డును ముందుకు నడిపిస్తున్నాడు.

ఇక, అరంగ్రేట మ్యాచ్ లో తిల‌క్ వ‌ర్మ విఫ‌లం అయ్యాడు. 9 బంతులు ఎదుర్కొన్న తిల‌క్ ఓ ఫోర్ కొట్టి 5 ప‌రుగులు మాత్రమే చేసి తాంజిమ్ హసన్ సాకిబ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో భార‌త్ 17 ప‌రుగులకే రెండో వికెట్ కోల్పోయింది. ఇక, నిలకడగా బ్యాటింగ్ చేస్తున్న భారత బ్యాటర్లకు మరోషాక్ తగిలింది. మహిదీ హసన్ బౌలింగ్‌లో కేఎల్ రాహుల్ (19) షమీమ్ హొస్సేన్ కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. మెహిదీ హసన్ బౌలింగ్‌లో ఇషాన్ కిష‌న్ ను ఎల్బీడ‌బ్ల్యూగా ఔట్ చేశాడు. దీంతో భార‌త్ 94 ప‌రుగుల వ‌ద్ద నాలుగో వికెట్ కోల్పోయింది.

షకీబ్ అల్ హసన్ బౌలింగ్‌లో సూర్యకుమార్ యాదవ్ (26 )క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 139 ప‌రుగులకే భార‌త్ ఐదో వికెట్ కోల్పోయి తీవ్ర క‌ష్టాల్లో ప‌డింది. ఇక బ్యాటింగ్ కు వచ్చిన రవీంద్ర జడేజా ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేదు. 12 బంతులాడి కేవలం 7 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాడు. తాంజిమ్ హసన్ సాకిబ్ బౌలింగ్‌లో రెండు ప‌రుగులు తీసి శుభ్‌మ‌న్ గిల్ 117 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో సెంచరీ మార్క్ ను అందుకున్నాడు. 42 ఓవర్లకు టీమిండియా స్కోరు 198/6గా ఉంది ప్రస్తుతం శుభ్‌మ‌న్ గిల్ (113), అక్షర్ పటేల్ (8) లు క్రీజులో ఉన్నారు.