Leading News Portal in Telugu

Ravindra Jadeja: 200 వికెట్ల క్లబ్ లోకి అడుగుపెట్టిన జడ్డూ భాయ్


టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా అరుదైన రికార్డ్ సాధించాడు. వన్డేల్లో 200 వికెట్లతో పాటు 2000 పరుగులు సాధించిన 14వ ఆటగాడిగా, వన్డేల్లో టీమిండియా తరఫున కపిల్‌ దేవ్ (3783 రన్స్, 253 వికెట్లు) తర్వాత ఈ ఘనత సాధించిన రెండో ప్లేయర్ గా.. భారత్‌ తరఫున వన్డేల్లో 200 వికెట్ల మార్క్ ను అందుకున్న ఏడవ బౌలర్ గా (337 వన్డే వికెట్లతో కుంబ్లే అగ్రస్థానంలో ఉన్నాడు) రికార్డుల్లోకి ఎక్కాడు.

ఆసియా కప్‌-2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో ఇవాళ (శుక్రవారం) జరుగుతున్న మ్యాచ్‌లో షమీమ్‌ హొస్సేన్‌ వికెట్‌ తీసుకోవడంతో జడ్డూ వన్డేల్లో 200 వికెట్ల మైలు రాయిని అందుకున్నాడు. కెరీర్‌లో 182వ వన్డే ఆడుతున్న జడేజా.. 200 వికెట్లతో పాటు ఇప్పటి వరకు 2,578 పరుగులు చేశాడు. కాగా, కొలంబో వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా పట్టుబిగించింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి టీమిండియా ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లా.. నిర్ణీత 50 ఓవర్లకు 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. షకీబ్‌ (80), తౌహిద్‌ హృదయ్ (54) అర్ధసెంచరీలతో రాణించగా.. తంజిద్‌ హసన్‌ (13), లిటన్‌ దాస్‌ (0), అనాముల్‌ హాక్‌ (4), మెహిది హసన్‌ (13), షమీమ్‌ హొస్సేన్‌ (1) దారుణంగా విఫలమయ్యారు.

మహెదీ హసన్, నసుమ్ అహ్మద్ కలిసి 8వ వికెట్‌కి 6 ఓవర్లలో 45 పరుగుల భాగస్వామ్యం అందించారు. 45 బంతుల్లో 6 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 44 రన్స్ చేసిన నసుమ్ అహ్మద్‌ని ప్రసిద్ధ్ కృష్ణ బౌల్డ్ చేశాడు. దీంతో ఆఖరి ఓవర్లలో తంజీమ్ హసన్ 8 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 14 పరుగులు చేయగా మహెదీ హసన్ 23 బంతుల్లో 3 ఫోర్లతో 29 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 3 వికెట్లు తీయగా.. మహ్మద్ షమీ రెండు వికెట్లు తీశాడు. ఇక, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, ప్రసిద్ధ్ కృష్ణ తలా ఓ వికెట్ తీసుకున్నారు.