Leading News Portal in Telugu

IND vs BAN: విరాట్ కోహ్లీని పక్కన పెట్టేయాలి.. ఇదే లాస్ట్ ఛాన్స్!


Aakash Chopra on Playing Shreyas Iyer vs Bangladesh: ఆసియా కప్‌ 2023 సూపర్-4లో చివరి మ్యాచ్‌కు రంగం సిద్ధం అయింది. భారత్, బంగ్లాదేశ్‌ జట్లు కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో నేటి మధ్యాహ్నం తలపడనున్నాయి. భారత్ ఇప్పటికే ఫైనల్ చేరడంతో ఈ మ్యాచ్‌కు పెద్దగా ప్రాముఖ్యత లేకుండా పోయింది. దాంతో బంగ్లాదేశ్‌పై భారత్ ప్రయోగాలు చేసే అవకాశం ఉంది. గాయం నుంచి కోలుకుని సుదీర్ఘ కాలం తర్వాత ఆసియా కప్‌ 2023లో రీఎంట్రీ ఇచ్చిన స్టార్ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ బంగ్లాపై ఆడే అవకాశాలు ఉన్నాయి. అయ్యర్‌ జట్టులోకి వస్తే.. యువ ఆటగాడు ఇషాన్ కిషన్‌పై వేటు పడుతుంది. అయితే ఇషాన్ బదులుగా సీనియర్ విరాట్ కోహ్లీని పక్కన పెట్టాలని మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాష్ చోప్రా సూచించాడు.

ఆకాశ్‌ చోప్రా తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ… ‘శ్రేయస్‌ అయ్యర్‌ ఆడడానికి ఫిట్‌గా ఉంటే.. అతడిని తప్పక బంగ్లాపై ఆడించాలి. నిజం చెప్పాలంటే అతను చాలా ప్రాక్టీస్ చేస్తున్నాడు. చెమటలు చిందిస్తున్నాడు. అయ్యర్ వెన్నునొప్పి నుంచి పూర్తిగా కోలుకున్నాడని నేను అనుకుంటున్నా. అయ్యర్‌ తుది జట్టులోకి వస్తే ఎవరిని తప్పిస్తారనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఇందుకు నా సమాధానం కొందరికి ఆగ్రహం తెప్పించవచ్చు. ఇంట్లో ఇబ్బందికర పరిస్థితులు వచ్చినపుడు.. చిన్న పిల్లలకు చెప్పకూడదు. పెద్దవాళ్లే బాధ్యత తీసుకుంటారు. జట్టులో కూడా ఇదే పాటించాలి’ అని అన్నాడు.

‘సీనియర్లు ఇప్పటికే తమ ఫామ్‌ను చూపించారు. నేను రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ గురించి మాట్లాడుతున్నాను. శ్రేయాస్ అయ్యర్‌ను తీసుకోవాలనుకుంటే.. నేను విరాట్‌ను విశ్రాంతి తీసుకోమని అడుగుతాను. ఎందుకంటే మొత్తం ఆగస్టులో అతడు చాలా క్రికెట్ ఆడాడు. కోహ్లీ ఫామ్‌ ఏంటో అందరికీ తెలుసు. రోహిత్‌ కెప్టెన్‌ కాబట్టి జట్టులో ఉంటాడు. సీనియర్స్ బాధ్యత తీసుకుని అడ్జస్ట్‌ అయిపోవాలి’ అని ఆకాశ్‌ చోప్రా సూచించాడు. సూర్యకుమార్ యాదవ్‌కు కూడా అవకాశం ఇవ్వాలని, అతడికి ఇంకెప్పుడు ఛాన్స్ ఇస్తారని ఆకాష్ ప్రశ్నించాడు.