Leading News Portal in Telugu

Rohit Sharma: ఏళ్లు గడిచినా ఈ విజయంను మరిచిపోలేం.. ఈ క్రెడిట్ సిరాజ్‌దే: రోహిత్ శర్మ


Rohit Sharma Heap Praise on Mohammad Siraj after Asia Cup 2023 Final: ఏళ్లు గడిచినా ఆసియా కప్ 2023 ఫైనల్ విజయంను మరిచిపోలేమని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేర్కొన్నాడు. ఈ విజయం క్రెడిట్ మొత్తం మొహ్మద్ సిరాజ్‌దే అని ప్రశంసించాడు. గాలిలో బంతి మూవ్ చేసే పేసర్లు చాలా అరుదని, సిరాజ్‌కు ఆ సామర్థ్యం ఉందని రోహిత్ చెప్పుకొచ్చాడు. ఆసియా కప్ 2023లో భాగంగా ఆదివారం కొలొంబోలో శ్రీలంకతో జరిగిన ఫైనల్లో భారత్ 10 వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. సిరాజ్ 6 వికెట్స్ (6/21) పడగొట్టగా.. ఒకే ఓవర్లో 4 వికెట్స్ తీశాడు. దాంతో లంక 50 పరుగులకే ఆలౌట్ అయింది.

ఫైనల్ మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ… ‘ఇదో గొప్ప ప్రదర్శ. ఫైనల్లో ఈ తరహా ప్రదర్శన మానసిక బలాన్ని చూపిస్తుంది. బంతితో అద్భుతమైన ఆరంభం దక్కాక.. బ్యాట్‌తో మంచి ముగింపు ఇచ్చాం. వికెట్స్ పడుతుంటే నేను స్లిప్‌లో నిలబడి అలా చూస్తూ ఉండిపోయా. మా సీమర్‌లు చాలా కష్టపడుతున్నారు. స్పష్టమైన ప్రణాళికలతో బౌలింగ్ చేశారు. ఈ విజయం ఏళ్లు గడిచినా మరిచిపోలేనిది. ఈ స్థాయిలో చెలరేగుతారని నేను అస్సలు ఊహించలేదు. ప్రతీ ఒక్కరు రాణించారు’ అని అన్నాడు.

‘ఈ విజయం క్రెడిట్ మొహ్మద్ సిరాజ్‌దే. గాలిలో బంతి మూవ్ చేసే సీమర్లు చాలా అరుదు. సిరాజ్‌కు ఆ సామర్థ్యం ఉంది. ఓ జట్టుగా ఈ టోర్నీలో మేం చేయాల్సినవన్నీ చేశాం. భారత్ వేదికగా జరిగే ఆస్ట్రేలియా సిరీస్‌తో పాటు ప్రపంచకప్‌ 2023 కోసం ఎదురుచూస్తున్నాం. మెగా టోర్నీలోనూ సత్తా చాటుతాం. పాకిస్థాన్‌పై తీవ్ర ఒత్తిడిలో హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ సెంచరీలు బాదారు. శుభ్‌మన్ గిల్ బాగా ఆడాడు. కుర్రాళ్లు వివిధ దశల్లో తమ బాధ్యతను నిర్వర్తించారు’ అని రోహిత్ చెప్పుకొచ్చాడు.