Leading News Portal in Telugu

R.Ashwin: ఏడాదిన్నర తర్వాత వన్డే జట్టులోకి.. వరల్డ్ కప్లో ఛాన్స్ దొరుకుతుందా..!


ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌కు భారత జట్టును ప్రకటించారు. అయితే ఈ సిరీస్ లో రవిచంద్రన్ అశ్విన్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. దాదాపు ఏడాదిన్నర తర్వాత మళ్లీ టీమిండియా వన్డే జట్టులోకి వచ్చాడు. మరోవైపు ప్రపంచకప్‌లో ఆడే అవకాశాలు కూడా పెరిగాయి. అయితే ఈ సిరీస్‌లోని మొదటి 2 మ్యాచ్‌లలో వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. తొలి 2 మ్యాచ్‌ల్లో టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ ఆడడం లేదు. దీంతో పాటు విరాట్ కోహ్లికి కూడా విశ్రాంతి ఇచ్చారు.

అయితే ఆస్ట్రేలియా సిరీస్‌లో రీఎంట్రీ ఇస్తుండటంతో రవిచంద్రన్ అశ్విన్‌కు ప్రపంచకప్‌ లో ఛాన్స్ ఇవ్వనున్నట్లు సంకేతాలు తెలుస్తున్నాయి. అయితే అశ్విన్‌ ప్రపంచకప్‌ జట్టులోకి రావడం అంత సులువు కాదు. ప్రపంచకప్ జట్టులోకి రావాలంటే ఆస్ట్రేలియా సిరీస్‌లో మెరుగైన ప్రదర్శన చూపించాలి. ఇదిలా ఉంటే.. ఆసియా కప్ లో కూడా అశ్విన్ కు చోటు దక్కలేదు. రవిచంద్రన్ అశ్విన్ ఆఫ్ స్పిన్నర్ బౌలర్ కాగా.. ఎడమ చేతి బ్యాట్స్‌మెన్లను ఇబ్బంది పెడుతూనే ఉంటాడు. ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్లపై అశ్విన్ వికెట్ టేకింగ్ ఎంపికగా నిరూపించుకోగలడు. అంతేకాకుండా తన బ్యాటింగ్‌తో జట్టుకు సహకారం అందించగలడు.

రవిచంద్రన్ అశ్విన్ వన్డే కెరీర్ గణాంకాలను పరిశీలిస్తే.. ఇప్పటి వరకు 113 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. ఈ మ్యాచ్‌ల్లో అశ్విన్ 151 వికెట్లు తీశాడు. ఈ ఫార్మాట్‌లో ఎకానమీ 4.94 కాగా.. స్ట్రయిక్ రేట్ 33.5. ఉంది. వన్డే ఫార్మాట్‌లో 25 పరుగులకు 4 వికెట్లు పడగొట్టడం బెస్ట్ ఫిగర్ ఉంది. అంతేకాకుండా.. అశ్విన్ వన్డే మ్యాచ్‌లలో 86.96 స్ట్రైక్ రేట్, 16.44 సగటుతో 707 పరుగులు చేశాడు.