Leading News Portal in Telugu

Disney+ Hotstar-Reliance: జియో దెబ్బకు ఆగమాగం అవుతున్న స్టార్ స్పోర్ట్స్‌.. ఇక అంబానీ చేతికి..!


Walt Disney talks with Reliance over India Streaming Business: భారతదేశంలో క్రికెట్‌ ఆటకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్రికెట్‌ను భారత ప్రజలు ఓ మతంలా భావిస్తారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా ప్రతిఒక్కరు క్రికెట్‌ను ఎంజాయ్ చేస్తారు. అంతర్జాతీయ క్రికెట్, ఐపీఎల్‌లు భారత ఆటగాళ్లకే కాదు.. బ్రాడ్‌కాస్టింగ్ సంస్థలకు కూడా కోట్లు కురిపిస్తాయి. గత కొన్నేళ్లుగా స్టార్ స్పోర్ట్స్‌ నెట్ వర్క్ క్రికెట్ మ్యాచ్‌లను ప్రసారం చేస్తూ.. తనకు పోటీయే లేదంటూ దూసుకుపోయింది. అలాంటి స్టార్ స్పోర్ట్స్‌.. జియో దెబ్బకు ఒక్కసారిగా కుదేలైంది.

భారత టెలి కమ్యూనికేషన్ రంగంలో సంచలనం సృష్టించిన ‘రిలయన్స్’.. నెమ్మదిగా అన్ని రంగాల్లోకి అడుగుపెడుతోంది. ఇప్పటికే ఫ్రాంచైజీ క్రికెట్‌తో (ముంబై ఇండియన్స్) క్రికెట్‌లోకి అడుగుపెట్టిన రిలయన్స్.. ఇటీవలే బ్రాడ్ కాస్టింగ్ వ్యాపారంలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ‘జియో సినిమా’ యాప్‌తో ఐపీఎల్ 2023ని ఫ్రీగా ప్రత్యక్ష ప్రసారం చేసింది. దాంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్‌ అభిమానులకు ఆనతి కాలంలోనే చేరువైంది. ఆపై భారత్ వేదికగా జరిగే మ్యాచ్‌లకు సంబంధించిన ఓటీటీ రైట్స్‌తో పాటు బ్రాడ్‌కాస్టింగ్ రైట్స్‌ను కూడా సొంతం చేసుకుంది.

ఐపీఎల్‌ 2023ని జియోసినిమా ఉచితంగా అందించడంతో.. ‘డిస్నీ హాట్‌స్టార్’ దిగొచ్చింది. జియోసినిమా దెబ్బకు ఆసియా కప్ 2023ని ఇప్పటికే ఉచితంగా ప్రసారం చేసిన డిస్నీ హాట్‌స్టార్.. వన్డే ప్రపంచకప్ 2023 మ్యాచ్‌లను కూడా నయా పైసా లేకుండా అందించేందుకు సిద్ధంగా ఉంది. అయితే రిలయన్స్ పోటీని తట్టుకోలేకపోతున్న స్టార్ నెట్ వర్క్.. డిస్నీ హాట్ స్టార్, స్టార్ స్పోర్ట్స్ ఇండియా వ్యాపారాన్ని రిలయన్స్ గ్రూప్‌కు అమ్ముకునేందుకు సిద్దమైనట్లు సమాచారం తెలుస్తోంది. వాల్ట్ డిస్నీ తన ఇండియా స్ట్రీమింగ్ మరియు టెలివిజన్ వ్యాపారం కోసం ముఖేష్ అంబానీతో ప్రాథమిక చర్చలు జరుపుతోందని తెలుస్తోంది. త్వరలోనే ఈ డీల్ ముగిసే అవకాశం ఉందట. ఇదే జరిగితే అంబానీ చేతిలో వాల్ట్ డిస్నీ ఇండియా స్ట్రీమింగ్ హక్కులు ఉంటాయి.