Leading News Portal in Telugu

ICC World Cup 2023: ప్రపంచకప్‌ ఆఫీషియల్ సాంగ్‌ వచ్చేసింది.. సందడి చేసిన రణ్‌వీర్‌, చహల్‌ సతీమణి!


ODI World Cup 2023 Song Dil Jashn Bole Officially Launched: ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచకప్ 2023 మరో రెండు వారాల వ్యవధిలో ప్రారంభం కానుంది. భారత గడ్డపై అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు మెగా టోర్నీ జరగనుంది. ప్రపంచకప్ ప్రారంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ అక్టోబర్ 5న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో న్యూజిలాండ్‌తో తలపడనుంది. మెగా టోర్నీకి సమయం దగ్గరపడుతుండడంతో అభిమానుల్లో అప్పుడే క్రికెట్ ఫీవర్ పట్టుకుంది. దీనికి మరింత పెంచేందుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రపంచకప్‌ అధికారిక సాంగ్‌ను బుధవారం రిలీజ్ చేసింది.

వన్డే ప్రపంచకప్‌ 2023 కోసం ఐసీసీ ప్రత్యేకంగా ఓ సాంగ్‌ను రూపొందించింది. ‘దిల్‌ జషన్‌ జషన్‌ బోలే..’ అంటూ సాంగ్‌ సాగుతోంది. ఈ సాంగ్‌లో అభిమానులను ‘వన్ డే ఎక్స్‌ప్రెస్’లో ప్రయాణిస్తున్నారు. ఈ సాంగ్‌ను ప్రీతమ్ చక్రవర్తి కంపోస్ చేశారు. ఇక స్టార్ హీరో రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించారు. రణ్‌వీర్‌తోపాటు టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్‌ సతీమణి ధనశ్రీ వర్మ కూడా ఆడిపాడారు. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

వన్డే ప్రపంచకప్‌ 2023 సాంగ్ Spotify, Apple Music, Gaana, Hungama, Resso, Wynk, Amazon Facebook, Instagram మరియు YouTube స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉంది. అభిమానులు త్వరలో బిగ్ ఎఫ్ఎమ్ మరియు రెడ్ ఎఫ్ఎమ్ రేడియో స్టేషన్లలో కూడా ఈ సాంగ్‌ను విని ఆనందించవచ్చు. ఇక ఆలస్యం ఎందుకు ప్రపంచకప్ ప్రత్యేక సాంగ్‌ను మీరూ చూసేయండి. ఇక 2011 తర్వాత స్వదేశంలో ప్రపంచకప్‌ జరుగుతుండడంతో.. టికెట్ల కోసం ఫాన్స్ ఎగబడుతున్నారు.