ICC T20 ప్రపంచ కప్ 2024 జూన్ 4న ప్రారంభంకానుంది. ఈ టోర్నీ టైటిల్ మ్యాచ్ జూన్ 20న జరగనుంది. ICC T20 ప్రపంచ కప్ 2024 మ్యాచ్‌లు అమెరికాలోని ఫ్లోరిడా, డల్లాస్, న్యూయార్క్‌లలో జరుగనున్నాయి. తొలిసారిగా అమెరికా ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ను నిర్వహిస్తోంది. మరోవైపు వెస్టిండీస్, అమెరికా ICC T20 వరల్డ్ కప్ 2024 ఆతిథ్య హక్కులను పొందాయి.
మీడియా కథనాల ప్రకారం.. ఇండియా-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ ఐసెన్‌హోవర్ పార్క్‌లో జరిగే అవకాశం ఉంది. ఇది న్యూయార్క్ నగరానికి 30 మైళ్ల దూరంలో ఉంది. ఇక 2024 టీ20 ప్రపంచ కప్‌లో మొత్తం 20 జట్లు ఆడనున్నాయి. ఈ 20 జట్లను 5 జట్లు చొప్పున 4 గ్రూపులుగా విభజించనున్నారు. అన్ని గ్రూపుల్లోని టాప్-2 జట్లు.. సూపర్-8 రౌండ్‌కు అర్హత సాధిస్తాయి. ఆ తరువాత 8 జట్లను 4 చొప్పున 2 గ్రూపులుగా విభజిస్తారు. రెండు గ్రూపుల్లోని టాప్-2 జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి.
టీ20 ప్రపంచ కప్ 2022 ఆస్ట్రేలియా గడ్డపై నిర్వహించారు. ఈ టోర్నీలో ఇంగ్లండ్ విజయం సాధించింది. భారత జట్టు ప్రయాణం మాత్రం సెమీఫైనల్‌తోనే ముగిసింది. సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 10 వికెట్ల తేడాతో భారత జట్టును ఓడించింది. 2007లో టీ20 ప్రపంచకప్‌ను భారత జట్టు గెలుచుకోగా.. టీ20 ప్రపంచకప్‌లో అదే తొలి ఎడిషన్. అప్పటి నుంచి టీ20 ప్రపంచకప్‌ను గెలవడంలో భారత జట్టు విఫలమైంది. అయితే 2024 ఐసీసీ టీ20 వరల్డ్‌కప్‌లో భారత జట్టు ఎలా రానిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే రోహిత్ శర్మ నాయకత్వంలో టీ20 ప్రపంచకప్‌ను భారత్ కచ్చితంగా గెలుస్తుందని టీమిండియా అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.