Leading News Portal in Telugu

Gautam Gambhir: పాకిస్తాన్ ఆటగాడిపై గౌతం గంభీర్ ప్రశంసలు.. ఏమన్నాడంటే..!


Gautam Gambhir: ఆసియా కప్ 2023లో భాగంగా ఇండియా-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ సమయంలో గౌతమ్ గంభీర్ టీమిండియా ఆటగాళ్లను విమర్శించారు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ పాకిస్తాన్ బౌలర్ హ్యారిస్ రవూఫ్ ను కౌగిలించుకోవడం, మాట్లాడటంపై గంభీర్ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా.. పాక్ కెప్టెన్ బాబర్ ఆజంపై ప్రశంసల జల్లు కురిపించాడు. 2023 వన్డే ప్రపంచకప్‌లో అతను చాలా పరుగులు చేస్తాడని గౌతమ్ గంభీర్ పేర్కొన్నాడు.

పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం.. 2023 ప్రపంచకప్‌లో అద్భుతంగా బ్యాటింగ్ చేస్తాడని చెప్పాడు. ప్రపంచ కప్‌లో తన బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లకు బాబర్ అజామ్ పెద్ద సవాలుగా నిలుస్తాడని తెలిపాడు. బాబర్ అజామ్‌ను ఆపడం ప్రత్యర్థి బౌలర్లకు కష్టమైన సవాలేనని కితాబునిచ్చాడు. అయితే ఇటీవల ఆసియా కప్‌లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో బాబర్ అజామ్ తొందరగానే ఔటయ్యాడు. అయితే ప్రపంచకప్‌లో బాబర్ ఆజం ఎలా రానిస్తాడనేది ఆసక్తికరంగా ఉంది.

ఇప్పటివరకు బాబర్ ఆజం పాకిస్థాన్ తరఫున 108 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. ఆ మ్యాచ్‌ల్లో బాబర్ అజామ్ 5409 పరుగులు చేశాడు. ఈ ఫార్మాట్‌లో.. సగటు 58.16 కాగా, అతని స్ట్రైక్ రేట్ 89.13. మరోవైపు వన్డే ఫార్మాట్‌లో 19 సెంచరీలు చేశాడు. వన్డే ఫార్మాట్‌లో యాభై పరుగుల సంఖ్యను 28 సార్లు దాటాడు.