Leading News Portal in Telugu

Asian Games 2023: సెమీస్‌లో బంగ్లాదేశ్‌ ఓటమి.. ఫైనల్‌కు చేరిన భారత్‌! పతకం ఖాయం


India Women Reach Asian Games 2023 Final, Medal Guaranteed: ఆసియా గేమ్స్ 2023 మహిళల క్రికెట్‌లో భారత్‌కు పతకం ఖాయం అయింది. ఆదివారం బంగ్లాదేశ్‌తో జరిగిన మొదటి సెమీ ఫైనల్‌లో భారత్ 8 వికెట్ల తేడాతో గెలిచింది. దీంతో ఆసియా క్రీడలు మహిళల క్రికెట్‌ ఫైనల్లో భారత్‌ అడుగుపెట్టింది. సెమీస్‌లో సత్తా చాటడంతో టీమిండియాకు పతకం ఖాయమైంది. ఫైనల్‌లో గెలిస్తే ఏకంగా స్వర్ణమే భారత్ ఖాతాలో చేరుతుంది. ఇప్పటికే ఆసియా క్రీడల్లో భారత్ బోణీ చేసింది. షూటింగ్, రోయింగ్‌లో రజత పతకాలు వచ్చాయి.

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌.. భారత బౌలర్ల దాటికి 51 పరుగులకే ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో పూజా వస్త్రాకర్‌ 4 వికెట్లతో చెలరేగింది. సటిటాస్ సాధు, గైక్వాడ్‌, వైద్యా తలా వికెట్‌ సాధించారు. బంగ్లా బ్యాటర్లలో నిగార్‌ సుల్తానా 12 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచింది. ఏకంగా ఐదుగురు బ్యాటర్లు డకౌట్ అయ్యారు. సుల్తానా తప్ప మిగతా వారందరూ సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితం అయ్యారు.

లక్ష్య ఛేదనలో భారత ఓపెనర్లు స్మృతి మంధాన (7), షెఫాలీ వర్మ (17) తడబడ్డారు. అయితే జెమీమా రోడ్రిగ్స్‌ (20), కనికా అహుజా (1) నాటౌట్‌గా నిలిచి లక్ష్యాన్ని పూర్తి చేశారు. బంగ్లా బౌలర్లు మరుఫా అక్టర్, ఫాహిమా ఖాతున్ తలో వికెట్ పడగొట్టారు. సెమీస్‌లో సత్తా చాటిన టీమిండియాకు పతకం ఖాయమైంది. ఫైనల్‌లోనూ గెలిస్తే భారత్ ఖాతాలో స్వర్ణం చేరుతుంది.