ఇండోర్ లో జరుగుతున్న రెండో వన్డేలో ఆస్ట్రేలియాపై టీమిండియా బ్యాట్స్మెన్లు సెంచరీల మోత మోగించారు. ఓపెనర్ గా బరిలోకి దిగిన శుభ్ మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్ అద్భుత సెంచరీలు చేశారు. గిల్ 92 బంతుల్లో సెంచరీ పూర్తి చేయగా.. శ్రేయస్ అయ్యర్ 86 బంతుల్లో సెంచరీ సాధించాడు. అయితే వీరిద్దరి సెంచరీలతో ప్రపంచకప్‌పై మరింత ఉత్సాహాన్ని పెంచారు. ఈ మ్యాచ్ లో సెంచరీ చేసిన వెంటనే ఇరువురు బ్యాట్స్ మెన్లు పెవిలియన్ బాట పట్టారు.
ఇదిలా ఉంటే.. గిల్ కు ఇది ఆరవ సెంచరీ. 35వ వన్డేలో 35వ ఇన్నింగ్స్‌లో గిల్ ఆరో సెంచరీని నమోదు చేశాడు. ఇప్పటి వరకు వన్డేల్లో గిల్ 1900 పరుగుల మార్క్‌ను దాటాడు. వన్డేల్లో 35 ఇన్నింగ్స్‌ల తర్వాత అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా గిల్ నిలిచాడు. ఈ సెంచరీతో గిల్ ఈ ఏడాది వన్డేల్లో 1200 పరుగుల సంఖ్యను కూడా చేరుకున్నాడు. ఆస్ట్రేలియాపై గిల్‌కి ఇదే తొలి సెంచరీ. మరోవైపు గతంలో కేఎల్ రాహుల్ ఆసియాకప్‌లో పాకిస్థాన్‌పై సెంచరీ సాధించాడు. అదే సమయంలో సూర్యకుమార్ కూడా అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అంతే కాకుండా విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషన్ వంటి ఆటగాళ్లు మిడిలార్డర్‌లో ఉన్నారు. అందువల్ల ప్రపంచ కప్ కోసం మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ మధ్య ఆసక్తికరమైన పోరు ఉండనుంది.
అంతకుముందు ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 16 పరుగుల స్కోరుపై తొలి దెబ్బ తగిలింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ 12 బంతుల్లో 8 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే ఆ తర్వాత శుభమన్ గిల్, శ్రేయాస్ అయ్యర్ మధ్య గొప్ప భాగస్వామ్యం ఏర్పడింది. భారత బ్యాట్స్‌మెన్‌లిద్దరూ ఆస్ట్రేలియా బౌలర్లపై సులువుగా పరుగులు సాధించారు. శ్రేయాస్ అయ్యర్, శుభ్‌మన్ గిల్ మధ్య రెండో వికెట్‌కు 200 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది.