Leading News Portal in Telugu

Asian Games 2023: సూపర్-16కి చేరుకున్న భారత ఫుట్‌బాల్ జట్టు


ఆసియా క్రీడల్లో భారత ఫుట్‌బాల్ జట్టు మయన్మార్ సవాల్‌ను ఎదుర్కొంది. భారత్-మయన్మార్ మధ్య జరిగిన మ్యాచ్ 1-1తో డ్రాగా ముగిసింది. అయినప్పటికీ భారత జట్టు ప్రీక్వార్టర్‌ ఫైనల్‌కు చేరుకుంది. 13 ఏళ్ల తర్వాత ఆసియా క్రీడల్లో భారత్ ప్రీక్వార్టర్‌ఫైనల్‌కు చేరుకుంది. భారత జట్టు తదుపరి రౌండ్‌లో సౌదీ అరేబియాతో తలపడనుంది. సౌదీ అరేబియా జట్టు బలంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ జట్టు FIFA ప్రపంచ కప్‌లో అర్జెంటీనాను ఓడించింది.

భారత్-మయన్మార్ మ్యాచ్ లో.. భారత కెప్టెన్ సునీల్ ఛెత్రి మ్యాచ్‌లో మొదటి గోల్ చేశాడు. మ్యాచ్ 23వ నిమిషంలో ఈ ఘనత సాధించాడు. దీంతో ఈ మ్యాచ్‌లో భారత జట్టు 1-0తో ముందంజలోకి వచ్చింది. ఆ తర్వాత మయన్మార్ జట్టు నిరంతరంగా అటాకింగ్ చేసినా గోల్ చేయడంలో సఫలం కాలేదు. అయితే రెండో అర్ధభాగంలో మయన్మార్ బాగా ఆడి.. 76వ నిమిషంలో గోల్ చేసింది. దీంతో మ్యాచ్ 1-1తో టై అయింది. అయితే ఆ తర్వాత ఇరు జట్లు గోల్స్ చేయలేకపోయాయి.

భారత ఫుట్‌బాల్ జట్టు తన మొదటి మ్యాచ్‌లో చైనాతో 1-5 తేడాతో ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. అయితే భారత జట్టు బంగ్లాదేశ్‌పై అద్భుతంగా పునరాగమనం చేసింది. భారత్ 1-0తో బంగ్లాదేశ్‌ను ఓడించింది. భారత్‌-మయన్మార్‌లు 3 మ్యాచ్‌ల్లో చెరో 4 పాయింట్లతో ఉన్నాయి. అంతే కాకుండా గోల్స్ తేడాలో కూడా భారత్, మయన్మార్‌లు కూడా సమానంగా ఉన్నాయి. అయితే టోర్నీలో మయన్మార్ కంటే భారత్ ఒక గోల్ ఎక్కువ చేసింది. దీంతో పాయింట్ల పట్టికలో మయన్మార్ మూడో స్థానంలో ఉంది. అదే సమయంలో చైనా 2 మ్యాచ్‌లు ముగిసేసరికి 6 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది.