Leading News Portal in Telugu

Shreyas Iyer: విరాట్ కోహ్లీ నుంచి నెంబర్‌ 3 స్పాట్‌ను ఎవరూ తీసుకోలేరు!


Shreyas Iyer Says Virat Kohli is one of the greatest in Cricket: వెన్ను గాయంతో ఆరు నెలల పాటు క్రికెట్‌కు దూరమైన స్టార్ బ్యాటర్ శ్రేయస్‌ అయ్యర్‌.. ఇటీవల కోలుకుని ఆసియా కప్‌ 2023తో పునరాగమనం చేశాడు. అయితే ఆసియా కప్‌లో రెండు మ్యాచ్‌లు ఆడేసరికే అయ్యర్‌కు మళ్లీ ఫిట్‌నెస్‌ సమస్యలు తలెత్తాయి. వెన్ను నొప్పి కారణంగా అతడు సూపర్‌-4 మ్యాచ్‌లకు దూరం అయ్యాడు. దాంతో అయ్యర్‌ ఫిట్‌నెస్‌పై సందేహాలు నెలకొన్నాయి. ప్రపంచకప్‌ 2023 జట్టులో ఉంటాడా? అనే అనుమానం కలిగింది. ఆ అనుమానాలకు ఒక్క ఇన్నింగ్స్‌తో చెక్ పెట్టాడు.

ఇండోర్ వేదికగా ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో శ్రేయస్‌ అయ్యర్‌ సెంచరీ (105; 90 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లు) బాదాడు. దీంతో ప్రపంచకప్‌ జట్టులో అయ్యర్‌ స్థానం సుస్థిరమైనట్లేనని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో అయ్యర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. క్రీడల్లో ఎత్తుపల్లాలతో కూడిన ప్రయాణం తప్పదని, భారత జట్టులో ఆడుతానని తనపై తనకు పూర్తి నమ్మకం ఉండేదని చెప్పాడు. రెండో వన్డేలో ప్లేయర్‌ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన అయ్యర్ మీడియాతో మాట్లాడాడు.

‘ఆటలో ఎత్తుపల్లాలతో కూడిన ప్రయాణం తప్పదు. సెంచరీ సాధించడం చాలా సంతోషంగా ఉంది. క్లిష్ట సమయాల్లో నాకు అండగా నిలిచిన సహచరులు, స్నేహితులు, కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు. టీవీల్లో భారత్ మ్యాచ్‌లు చూసినప్పుడు నేను కూడా ఆడితే బాగుంటుందని అనిపించేది. ఇప్పుడు టీమిండియా తరఫున ఆడుతున్నా. గాయాలు చాలా ఇబ్బంది పెట్టాయి. నాపై నాకు పూర్తి నమ్మకం ఉండడం వల్లే మళ్లీ జట్టులో ఆడుతున్నా. నా లక్ష్యాలేంటో నాకు తెలుసు. వాటి కోసం ఎప్పుడూ కష్టపడుతున్నా. ఆస్ట్రేలియాపై నా ప్రణాళికలను పక్కాగా అమలు చేశా. జట్టు కోసం ఏ స్థానంలోనైనా ఆడేందుకు సిద్ధం. అయితే నెంబర్‌ 3 స్పాట్‌ విరాట్ కోహ్లీదే. అతడి నుంచి దాన్ని ఎవరూ తీసుకోలేరు. విరాట్ అత్యుత్తమ క్రికెటర్’ అని శ్రేయస్‌ అయ్యర్ తెలిపాడు.