Leading News Portal in Telugu

Suryakumar Yadav Sixes: కెమరూన్‌ గ్రీన్‌కు దడ పుట్టించిన సూర్యకుమార్‌ యాదవ్.. వీడియో చూశారా?


Suryakumar Yadav 4 Sixes Video Goes Viral: ‘సూర్యకుమార్‌ యాదవ్’.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంత‌ర్జాతీయ క్రికెట్‌లోకి కాస్త ఆల‌స్యంగా ఎంట్రీ ఇచ్చినా.. త‌న‌దైన ఆట‌తో అభిమానులను అల‌రిస్తున్నాడు. మైదానం న‌లువైపులా షాట్లు కొడుతూ.. ‘మిస్ట‌ర్ 360’గా పేరు తెచ్చుకున్నాడు. ప్ర‌త్య‌ర్థి బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపిస్తున్న సూర్య.. టీ20ల్లో నంబ‌ర్ వ‌న్ బ్యాటర్‌గా కొన‌సాగుతున్నాడు. పొట్టి ఫార్మ‌ట్‌లో దూకుడును వన్డేల్లో కూడా కొనసాగిస్తున్నాడు. ప్రపంచకప్ 2023కి ముందు ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో సూర్యకుమార్‌ చెలరేగుతున్నాడు.

మొహాలీ వేదికగా జరిగిన మొదటి వన్డేలో హాఫ్ సెంచరీ చేసిన సూర్యకుమార్‌ యాదవ్.. ఇండోర్‌ వేదికగా జరిగిన రెండో వన్డేలో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. బౌండరీలు, సిక్సర్లు బాది పెను విధ్వంసం సృష్టించాడు. కేవలం 24 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. రెండో వన్డేలో మొత్తంగా 37 బంతులు ఎదుర్కొన్న సూర్య.. 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 72 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. నయా మిస్ట‌ర్ 360 ధాటికి ఆస్ట్రేలియా బౌలర్లు తేలిపోయారు. కెమరూన్‌ గ్రీన్‌కు అయితే దడ పుట్టించాడు.

కెమరూన్‌ గ్రీన్‌ వేసిన ఇన్నింగ్స్‌ 44వ ఓవర్‌లో సూర్యకుమార్‌ యాదవ్ పూనకం వచ్చినట్లు ఊగిపోయాడు. మొదటి నాలుగు బంతుల్లో సిక్సర్లు​ బాది.. గ్రీన్‌కు దడ పుట్టించాడు. యువరాజ్ సింగ్ మాదిరి ఆరు బంతుల్లో 6 సిక్సులు బాదుతాడు అని అందరూ అనుకున్నా.. 5దవ బంతి మిస్ అయింది. 44వ ఓవర్‌లో తొలి నాలుగు బంతులను సిక్సర్లుగా మలిచిన సూర్య.. ఆ ఓవర్‌లో 26 పరుగులు పిండుకున్నాడు. సూర్య ధాటికి గ్రీన్‌ 10 ఓవర్లలో ఏకంగా 103 పరుగులు సమర్పించుకున్నాడు. సూర్య సిక్సులకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.