Leading News Portal in Telugu

Asian Games 2023: క్రికెట్‌లో మేం స్వర్ణం గెలిచాం.. ఇక మీ వంతు: జెమీమా


Jemimah Rodrigues urges India Men’s Cricket Team to go for Gold Medal in Asian Games 2023: భారత మహిళా క్రికెట్‌ జట్టు చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఆసియా గేమ్స్ 2023 ఫైనల్‌లో శ్రీలంకను ఓడించి స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. ఫైనల్‌లో టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌ భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 116 పరుగులు చేసింది. స్మృతి మంధాన (46), జెమీమా రోడ్రిగ్స్‌ (42) రాణించారు. 117 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంక 20 ఓవర్లలో 8 వికెట్లకు 97 పరుగులు మాత్రమే చేసింది. భారత యువ పేసర్ టిటాస్‌ సాధు 3 వికెట్లు తీసి శ్రీలంకను దెబ్బ తీసింది.

ఆసియా గేమ్స్ 2023లో జెమీమా రోడ్రిగ్స్‌ టాప్‌ స్కోరర్‌. మూడు మ్యాచుల్లో జెమీమా 109 పరుగులు చేసింది. ఫైనల్‌లో కీలక సమయంలో 42 పరుగులు చేసి జట్టు మంచి స్కోర్ సాధించేందుకు దోహదపడింది. గోల్డ్ మెడల్‌ అందుకున్న తర్వాత జెమీమా మాట్లాడుతూ భారత పురుషుల జట్టుకూ ఓ సందేశం పంపింది. ‘ఇక మనం భారత పురుషుల క్రికెట్‌ జట్టు గురించి మాట్లాడుదాం. వారికి ఒకటే విజ్ఞప్తి.. మేం స్వర్ణం గెలిచాం, ఇక మీ వంతు. మీరు కూడా ఆసియా గేమ్స్ 2023లో గోల్డ్‌ మెడల్‌ సాదించాలి అని జెమీమా ‘కోరింది.

‘పోడియంపై భారత జాతీయ జెండా ఎగరడం ఎంతో ఆనందంగా ఉంది. ఇలాంటి అనుభూతి అద్భుతం. స్వర్ణ పతకం గెలవడం చాలా స్పెషల్‌. భారత మహిళా క్రికెట్‌ జట్టు తొలిసారి గోల్డ్‌ మెడల్‌ సాధించడం చరిత్రలో నిలిచిపోతుంది. మేం కూడా ఒక మెడల్‌ను దేశం కోసం సాధించామని చెప్పుకుంటాం. ఆసియా క్రీడల్లో భారత జెర్సీని ధరించి బరిలోకి దిగడం ఓ భిన్న అనుభవం. ఫైనల్‌లో అందరూ బాగా ఆడారు’ అని జెమీమా రోడ్రిగ్స్‌ తెలిపింది. రుతురాజ్‌ గైక్వాడ్‌ నాయకత్వంలోని పురుషుల జట్టు అక్టోబర్ 3న క్వార్టర్ ఫైనల్‌ మ్యాచ్ ఆడనుంది. ప్రపంచకప్ 2023 నేపథ్యంలో ఆసియా గేమ్స్ 2023లో ద్వితీయ శ్రేణి జట్టు బరిలోకి దిగనుంది.