భారత జట్టుతో రేపు ( బుధవారం ) జరుగబోయే నామమాత్రపు మూడో వన్డేలో ఇద్దరు ఆస్ట్రేలియా స్టార్లు ప్లేయర్లు రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. గాయాల కారణంగా తొలి రెండు వన్డేలకు దూరంగా ఉన్న గ్లెన్ మ్యాక్స్‌వెల్, మిచెల్ స్టార్క్ మూడో వన్డేలో బరిలో దిగుతున్నట్లు తెలుస్తుంది. వీరిద్దరూ ఇవాళ జరిగిన నెట్స్ సెషన్లో పాల్గొన్నారు. మిచెల్ స్టార్క్, గ్లెన్ మ్యాక్స్ వెల్ రాకతో తొలి వన్డేలో ఆడిన నాథన్ ఇల్లిస్, రెండో వన్డే ఆడిన స్పెన్సర్ జాన్సన్ టీమ్ కు దూరంకానున్నారు.
ఇదిలా ఉంటే, 3 మ్యాచ్‌ల సిరీస్ లో భాగంగా రేపు ( బుధవారం ) జరుగబోయే చివరి మ్యాచ్‌లో భారత్-ఆస్ట్రేలియా జట్లు రాజ్‌కోట్ వేదికగా తలపడనున్నాయి. తొలి రెండు వన్డేలు గెలిచిన భారత్ ఇది వరకే 2-0తో సిరీస్ ను కైవసం చేసుకుంది. దీంతో రేపు జరుగబోయే మ్యాచ్ ఇరు జట్లకు వరల్డ్‌కప్‌కు ముందు ప్రాక్టీస్ మ్యాచ్ గా పరిగణించబడుతుంది. మరోవైపు రేపటి మ్యాచ్‌లో టీమిండియా స్టార్లు సైతం బరిలోకి దిగనున్నారు. తొలి రెండు వన్డేలకు దూరంగా ఉన్న కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్ రేపటి మ్యాచ్‌లో ఆడనున్నారు. అలాగే రెండో వన్డేకు దూరంగా ఉన్న జస్ప్రీత్ బుమ్రా సైతం రేపటి మ్యాచ్‌లో ఆడే ఛాన్స్ ఉంది. నామమాత్రపు మ్యాచ్ అయినా భారత్ పూర్తి స్థాయి జట్టుతో బరిలోకి దిగాలని చూస్తుంది. చూడాలి రేపటి మ్యాచ్ లో ఏ జట్టు పైచేయి సాధిస్తుంది అనేది.