Leading News Portal in Telugu

Kushal Malla Fastest Century: మిల్లర్, రోహిత్ రికార్డు బ్రేక్.. ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన నేపాల్ బ్యాటర్!


Nepal Batter Kushal Malla Hits Fastest T20I Century: అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన బ్యాటర్‌గా నేపాల్ ఆటగాడు కుశాల్‌ మల్లా చరిత్రకెక్కాడు. కుశాల్‌ 34 బంతుల్లోనే సెంచరీ బాదాడు. ఆసియా గేమ్స్ 2023లో భాగంగా మంగోలియాతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో కుశాల్‌ ఫాస్టెస్ట్ సెంచరీ చేశాడు. దాంతో అంతర్జాతీయ టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన దక్షిణాఫ్రికా ప్లేయర్ డేవిడ్ మిల్లర్, భారత కెప్టెన్ రోహిత్ శర్మల రికార్డు బ్రేక్ అయింది. మిల్లర్, రోహిత్‌లు 2017లో 35 బంతుల్లో సెంచరీ బాదారు.

మంగోలియాపై కుశాల్‌ మల్లా మొత్తం 50 బంతుల్లో 137 పరుగులు చేశాడు. కుశాల్‌ 8 ఫోర్లు, 12 సిక్స్‌లు బాదాడు. ఇప్పటివరకు టీ20 క్రికెట్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు దక్షిణాఫ్రికా ఆటగాడు డేవిడ్ మిల్లర్ పేరిట ఉండేది. మిల్లర్ 2017లో బంగ్లాదేశ్‌పై 35 బంతుల్లోనే శతకం కొట్టాడు. ఆ రికార్డును కుశాల్‌ తాజాగా బ్రేక్ చేశాడు. 2017లో శ్రీలంకపై రోహిత్ శర్మ కూడా 35 బంతుల్లో సెంచరీ చేశాడు. చెక్ రిపబ్లిక్ ఆటగాడు సుదేష్ విక్రమశేఖర 2019లో టర్కీపై 35 బంతుల్లో శతకం బాదాడు.

పురుషుల క్రికెట్‌లో మంగోలియా నేడు అరంగేట్రం చేసింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) 2021లో మంగోలియాను తమ అసోసియేట్ జట్టుగా గుర్తించింది. ఆసియా గేమ్స్ 2023 గ్రూప్ ‘ఎ’లో ఉన్న నేపాల్ ఆదివారం మాల్దీవులతో రెండో మ్యాచ్ ఆడనుంది. గ్రూప్ ‘ఎ’లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంటే నేపాల్ క్వార్టర్ ఫైనల్‌లోకి ప్రవేశిస్తుంది. క్వార్టర్ ఫైనల్‌ చేరితే భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక మరియు ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో నేపాల్ ఆడనుంది.