టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్ కు వన్డే ప్రపంచకప్-2023లో ఆడే ఛాన్స్ కనిపిస్తుంది. స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ గాయపడటంతో అశ్విన్ జట్టులోకి వచ్చే మార్గం సుగమమయ్యే అవకాశం ఉంది. టీమిండియా సారథి రోహిత్ శర్మ ఇందుకు సంబంధించి సంకేతాలు ఇచ్చాడు.. కాగా, ఆసియా వన్డే కప్-2023లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా అక్షర్ పటేల్ గాయపడి ఇంకా కోలుకోలేదు. ఈ క్రమంలో స్వదేశంలో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు అతడు దూరంగా ఉన్నాడు. తొలి రెండు మ్యాచ్‌లు ఆడకపోయినప్పటికీ.. రాజ్‌కోట్ వన్డేకు అందుబాటులోకి వస్తాడనుకుంటే గాయం తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది.
ఇక, వన్డే ప్రపంచకప్ టోర్నమెంట్ కి మరో ఎనిమిది రోజులు మాత్రమే టైం ఉంది. ఈ నేపథ్యంలో అక్షర్ పటేల్ గనుక కోలుకోకపోతే రవిచంద్రన్ అశ్విన్ ప్రపంచకప్ టీమ్ లోకి ఎంట్రీ ఇవ్వడం గ్యారెంటీ!.. అయితే, సుదీర్ఘ కాలం తర్వాత ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌తో అశ్విన్ పునరాగమనం చేశాడు. రెండు మ్యాచ్‌లలో కలిపి 4 వికెట్లు తీసుకున్నాడు. వన్డేల్లోనూ సత్తా చాటగలనని అతడూ నిరూపించుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆసీస్‌తో నామమాత్రపు మూడో వన్డేకు ముందు మీడియాతో మాట్లాడిన కెప్టెన్ రోహిత్ శర్మకు అశ్విన్ గురించి ఓ ప్రశ్న ఎదురైంది.. ఇందుకు సమాధానంగా.. అతడు క్లాస్ బౌలర్. ఒత్తిడిని అధిగమించి ఎలా ఆడాలో తెలిసిన అనుభవజ్ఞుడు.. గతేడాది కాలంగా వన్డేలు ఆడనప్పటికీ గత రెండు మ్యాచ్‌లతో తన బౌలింగ్ స్థాయి ఏమిటో చాటి చెప్పాడు అంటూ పేర్కొన్నాడు.. అతడి బౌలింగ్‌లో వైవిధ్యం ఉంటుంది అని రోహిత్ శర్మ వెల్లడించాడు.
అయితే, వన్డే ప్రపంచకప్ కు ముందు మాకు అన్నీ సానుకూలాంశాలే కనపడుతున్నాయని రోహిత్ శర్మ అన్నారు. మా బ్యాకప్ ప్లేయర్లందరూ రెడీగా ఉండటం హ్యాపీగా ఉంది అని రోహిత్ సమాధానమిచ్చాడు. కాగా సెప్టెంబరు 28 వరకు ప్రపంచకప్ టీమ్ లో మార్పులకు ఛాన్స్ ఉన్న నేపథ్యంలో రోహిత్ మాటల్ని బట్టి అశ్విన్ వరల్డ్ కప్ ఆడే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు.. అక్షర్ పటేల్ ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందుతున్నాడు. ఇక అక్టోబరు 5 నుంచి ఐసీసీ టోర్నమెంట్ ప్రారంభం కానుండగా.. అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో టీమిండియా తమ తొలి మ్యాచ్ ఆడుతుంది.