వన్డే ప్రపంచ కప్ 2023 అక్టోబర్ 5 నుండి భారతదేశం ఆతిథ్యమివ్వనున్న సంగతి తెలిసిందే. మ్యాచ్ లు ప్రారంభానికి ఇంకెంతో సమయం లేదు. అయితే ఆస్ట్రేలియా జట్టుకు ప్రపంచకప్ కు ముందు ఎదురుదెబ్బ తగిలింది. గాయం నుండి పూర్తిగా కోలుకోలేక మొత్తం టోర్నమెంట్‌కు దూరమయ్యాడు ఆల్ రౌండర్ అష్టన్ అగర్. అయితే ప్రపంచకప్‌లో పాల్గొనే ఆస్ట్రేలియా జట్టు ఇప్పుడు మార్పులు చేసే అవకాశం ఉంది. అయితే వారు మార్పులు చేయడానికి కేవలం ఇవాళ ఒక్కరోజు సమయం మాత్రమే మిగిలి ఉంది.
గత కొన్నిరోజులుగా గాయం కారణంగా బాధ పడుతున్న అష్టన్ అగర్.. ప్రపంచ కప్ వరకు ఫిట్ అవుతాడని భావించారు. అయితే ఇంకా గాయం తగ్గకపోవడంతో వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించాడు. ఈ కీలక ఆటగాడు జట్టులో లేకపోవడం కంగారులకు పెద్ద సమస్యే.. ఎందుకంటే అతను చాలాసార్లు మ్యాచ్ విన్నర్ పాత్రను పోషించాడు. అయితే ఇప్పుడు జట్టులో లేకపోవడంతో మరో ఆటగాడి కోసం సెలక్టర్లు వెతుకుతున్నారు. అతని స్థానంలో భారత సంతతికి చెందిన లెగ్ స్పిన్నర్ తన్వీర్ సంఘా 15 మంది ప్రపంచ కప్ జట్టులో చేరనున్నారు. భారత్‌తో జరిగిన 3 వన్డేల సిరీస్‌లో సంఘ చివరి మ్యాచ్‌లో ఆడాడు.
వన్డే ప్రపంచకప్ 2023లో ఆస్ట్రేలియా జట్టు భారత్‌తో అక్టోబర్ 8న చెన్నైలో తలపడనుంది. ఈ మ్యాచ్ కు ముందు కంగారు జట్టు 2 ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడనుంది. సెప్టెంబరు 30న నెదర్లాండ్స్, అక్టోబర్ 3న పాకిస్థాన్‌తో ప్రాక్టీస్ మ్యాచ్ లు ఆడనుంది.