Hyderabad Pacer Nishanth Saranu impresses Pakistan Cricket Team during net Session: వన్డే ప్రపంచకప్ 2023కి సమయం దగ్గరపడింది. అహ్మదాబాద్ వేదికగా ఆక్టోబర్ 5న ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య జరిగే మ్యాచ్‌తో మెగా టోర్నీ ప్రారంభం కానుంది. అయితే వార్మప్ మ్యాచ్‌లు మాత్రం నేటి నుంచే (సెప్టెంబరు 29) ఆరంభం కానున్నాయి. సెప్టెంబరు 29 నుంచి అక్టోబరు 3 వరకు జరిగే ప్రాక్టీస్ మ్యాచ్‌లకు హైదరాబాద్, తిరువనంతపురం, గువాహటి ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఈరోజు హైదరాబాద్‌లో పాకిస్తాన్, న్యూజిలాండ్ తలపడనున్నాయి.
ప్రపంచకప్ 2023 వార్మప్ మ్యాచ్ కోసం పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఇప్పటికే హైదరాబాద్ చేరుకొని.. ప్రాక్టీస్ సెషన్స్‌ను మొదలు పెట్టింది. హైదరాబాద్ అండర్-19 ఫాస్ట్ బౌలర్ నిశాంత్ సరను పాకిస్తాన్ తమ నెట్ బౌలర్‌గా నియమించకుంది. గురువారం నెట్స్‌లో పాక్ బ్యాటర్లకు నిశాంత్ బౌలింగ్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నిశాంత్ గంటకు 140 నుంచి 150 వేగంతో బంతులు వేయగలడు. ఆరు అడుగులకు పైగా ఉన్న అతడు బౌన్సర్స్‌ను కూడా సంధించగలడు.
నెట్స్‌లో నిశాంత్ బౌలింగ్‌ను ఎదుర్కొన్న పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ ఫఖర్ జమాన్ ప్రశంసల వర్షం కురిపించాడు. నిశాంత్‌కు అద్భుతమైన బౌలింగ్ స్కిల్స్ ఉన్నాయని, కచ్చితంగా అతడు ఉన్నత స్ధాయికి చేరుకుంటాడన్నాడు. ఆస్ట్రేలియా స్టార్ పేసర్లు మిచెల్ స్టార్క్, ప్యాట్ కమ్మిన్స్ తమకు ఆదర్శమని నిశాంత్ తెలిపాడు. ముందుగా హైదరాబాద్ తరఫున, ఆపై భారత జట్టులో తనకు ఆడాలని ఉందని హైదరాబాద్ యువ పేసర్ తెలిపాడు.