Leading News Portal in Telugu

Asian Games 2023: ఆసియా క్రీడల్లో భారత్ ఖాతాలో మరో స్వర్ణం.. టెన్నిస్‌లో పతకం


ఆసియా క్రీడల్లో భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. ఈసారి టెన్నిస్ మిక్స్‌డ్ డబుల్స్ ఈవెంట్‌లో రోహన్ బోపన్న, రుతుజా భోసలే జోడీ స్వర్ణం సాధించింది. ఫైనల్లో భారత్ జోడీ 2-6, 6-3, 10-4తో తైపీ జోడీని ఓడించింది. ఈ మ్యాచ్‌లో భారత జోడీ తొలి సెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాత రెండో సెట్‌లో రోహన్ బోపన్న, రుతుజా భోసలే అద్భుతంగా కమ్బ్యాక్ అయి చివరికి సూపర్ టై బ్రేక్‌లో మ్యాచ్‌ను సొంతం చేసుకున్నారు.

భారత జోడీ రోహన్ బోపన్న, రుతుజా భోసలే తొలి సెట్‌లో ఘోర పరాజయాన్ని చవిచూశారు. 6-2తో తైపీ జోడీ చేతిలో ఓడింది. ఆ తర్వాత భారత జోడి రెండో సెట్‌లో అద్భుతంగా పునరాగమనం చేసి.. తైపీ జోడీ అన్-షువో లియాంగ్, సుంగ్-హావో హువాంగ్‌లను 10-4తో ఓడించి మ్యాచ్‌ను 1-1తో సమం చేసింది. సూపర్ టై బ్రేక్‌లో రోహన్ బోపన్న, రుతుజా భోసాలే 10-4తో అద్భుతంగా స్కోర్ చేయడం ద్వారా టెన్నిస్ మిక్స్‌డ్ డబుల్స్ ఈవెంట్‌లో చరిత్ర సృష్టించారు. దీంతో ఆసియా క్రీడలలో భారత్‌కు మరో స్వర్ణాన్ని అందించారు.

19వ ఆసియా క్రీడల్లో భారత్‌కు ఇది 9వ స్వర్ణం. ఈ స్వర్ణ పతకంతో భారత్ మొత్తం పతకాల సంఖ్య 13 రజతాలు, 13 కాంస్యాలతో కలిపి 35కి చేరుకుంది. ఏడో రోజు భారత్‌కు ఇదే తొలి బంగారు పతకం. ఆసియా క్రీడల్లో ఇప్పటివరకు భారత్ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తుంది.