India vs England Warm-Up Match Abandoned Due to Rain: వన్డే ప్రపంచకప్ 2023 వార్మప్ మ్యాచ్‌లను వరణుడు అడ్డుకుంటున్నాడు. వరుసగా రెండో రోజూ వాన పడడంతో మ్యాచ్‌లు సాధ్యం కాలేదు. భారీ వర్షం కారణంగా శనివారం గువాహటిలో భారత్, ఇంగ్లండ్ మధ్య జరగాల్సిన వామప్ మ్యాచ్ రద్దయింది. వర్షం తెరిపినివ్వకపోవడంతో ఒక్క బంతి పడకుండానే వార్మప్ మ్యాచ్ రద్దయింది. మ్యాచ్ ఆరంభానికి ముందు పరిస్థితి బాగానే ఉండటంతో టాస్ వేశారు. టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే టాస్ అనంతరం వర్షం పడడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేశారు.
వర్షం కారణంగా మ్యాచ్ జరగదని భారత్, ఇంగ్లండ్ ఆటగాళ్లు ముందే హోటల్‌కు వెళ్లిపోయారు. అధికారికంగా అంపైర్లు ప్రకటించకముందే మైదానం వీడి హోటల్‌కు వెళ్లారు. ప్రపంచకప్ 2023లో ప్రతి జట్టు రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడనుంది. భారత్ తన రెండో సన్నాహక మ్యాచ్ కోసం తిరువనంతపురం ఈరోజు బయల్దేరుతుంది. అక్టోబరు 3న నెదర్లాండ్స్‌తో భారత్ తలపడుతుంది. ఇక ఇంగ్లండ్ గువాహటిలోనే తన రెండో ప్రాక్టీస్‌ను అక్టోబర్ 2న బంగ్లాదేశ్‌తో ఆడుతుంది.
మరోవైపు శనివారం ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్ మధ్య జరగాల్సిన ప్రాక్టీస్ మ్యాచ్ కూడా వాన వల్ల రద్దయింది. వర్షం కారణంగా ఇన్నింగ్స్‌ను 23 ఓవర్లకు కుదించగా.. మొదట ఆసీస్ 7 వికెట్లకు 166 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో నెదర్లాండ్స్ 84/6తో ఉన్నప్పుడు వర్షం మళ్లీ మొదలైంది. దాంతో మ్యాచ్ రద్దయింది. ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ హ్యాట్రిక్ నమోదు చేశాడు. ప్రపంచకప్ కప్ అసలు సమరం అక్టోబర్ 5న ఆరంభం కానుండగా.. 8న చెన్నైలో ఆస్ట్రేలియాను భారత్ ఢీ కొట్టనుంది.