Virat Kohli should play 4th ICC ODI World Cup: భారత గడ్డపై జరిగే ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 మ్యాచ్‌లు అక్టోబర్ 5 నుంచి ప్రారంభం కానున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగే ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, రన్నరప్ న్యూజిలాండ్ జల్టు తలపడనున్నాయి. ఇక అక్టోబర్ 8న చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఆస్ట్రేలియాతో భారత్ తన తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ కోసం భారత ప్లేయర్స్ సిద్ధమవుతున్నారు. ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీని ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది.
ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ మైదానంలో దిగగానే నాలుగు వన్డే ప్రపంచకప్‌లు ఆడిన ఐదో భారత ఆటగాడిగా రికార్డు నెలకొల్పుతాడు. సచిన్ టెండూల్కర్, కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, అనిల్ కుంబ్లే, ఎంఎస్ ధోనీలు విరాట్ కంటే ముందున్నారు. కోహ్లీ ఇప్పటివరకు 2011, 2015, 2019 వన్డే ప్రపంచకప్‌లలో భారత జట్టు ప్రాతినిథ్యం వహించాడు. అక్టోబర్ 8న ఆస్ట్రేలియా మ్యాచ్‌లో ఆడితే నాలుగో వన్డే ప్రపంచకప్ ఆడిన ఆటగాడిగా నిలుస్తాడు.
కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, అనిల్ కుంబ్లే, ఎంఎస్ ధోనీలు నాలుగు వన్డే ప్రపంచకప్‌లు ఆడారు. విరాట్ కోహ్లీ వీరి సరసన చేరతాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ తొలి స్ధానంలో ఉన్నాడు. సచిన్ తన కెరీర్లో 6 వన్డే ప్రపంచకప్‌లు ఆడాడు. అత్యధిక ప్రపంచకప్‌లు ఆడిన రికార్డును సచిన్‌తో పాటు పాకిస్తాన్ దిగ్గజం జావేద్ మియాందాద్ (6) సంయుక్తంగా కలిగి ఉన్నాడు. రికీ పాంటింగ్, మహేల జయవర్ధనే, జాక్వెస్ కలిస్ ఐదు సార్లు వన్డే వరల్డ్‌కప్‌లలో భాగమయ్యారు.