చైనాలోని హాంగ్‌జౌ వేదికగా జరుగుతున్న 19వ ఆసియా క్రీడల్లో భారత మహిళల హాకీ జట్టు అద్భుత ప్రదర్శన చూపించింది. దక్షిణ కొరియా మహిళల జట్టుతో జరిగిన కీలకమైన మ్యాచ్‌లో.. భారత జట్టు మ్యాచ్‌ను 1-1తో డ్రాగా ముగించింది. దీంతో భారత మహిళల జట్టు సెమీఫైనల్‌లో చోటు ఖాయం చేసుకుంది. పూల్-ఎలో.. భారత మహిళల జట్టు 7 పాయింట్లతో మొదటి స్థానంలో ఉంది. భారత జట్టు పూల్‌లో హాంకాంగ్ మహిళల జట్టుతో చివరి మ్యాచ్ ఆడనుంది.
ప్రస్తుతం భారత జట్టు, దక్షిణ కొరియా రెండూ చెరో 7 పాయింట్లతో ఉండగా.. గోల్స్ పరంగా టీమిండియా వారి కంటే ముందుంది. హాంకాంగ్‌తో జరిగే మ్యాచ్ భారత మహిళల హాకీ జట్టుకు పెద్ద కష్టం కాదు. ఎందుకంటే హాంకాంగ్ జట్టు తన మొదటి మూడు మ్యాచ్‌ల్లో ఓటమిని చవిచూసింది. ఇక ఈ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే.. ఆట 12వ నిమిషంలో దక్షిణ కొరియా జట్టు తొలి గోల్ చేయడంతో భారత జట్టుపై ఒత్తిడి తెచ్చింది. ఆ తర్వాత.. భారత్ మూడో క్వార్టర్‌లో పునరాగమనం చేసి దీప్ గ్రేస్ చేసిన అద్భుతమైన గోల్‌తో మ్యాచ్‌ను 1-1తో సమం చేసింది. ఇక్కడి నుంచి మ్యాచ్ ముగిసే వరకు ఇరు జట్లు గోల్ చేసేందుకు పలు ప్రయత్నాలు చేసినా ఎవరూ సఫలం కాకపోవడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది.
మరోవైపు ఆసియా క్రీడలు 2023లో.. ఇప్పటివరకు భారత్ మొత్తం 42 పతకాలను గెలుచుకుంది. అందులో 11 బంగారు పతకాలు, 16 రజతాలు, 15 కాంస్య పతకాలు ఉన్నాయి. ఈరోజు సాయంత్రం జరిగే అథ్లెటిక్స్ ఈవెంట్‌లో భారత్ మరిన్ని పతకాలు సాధిస్తుందని అంచనా వేస్తున్నారు.