Leading News Portal in Telugu

Asian Games 2023: టేబుల్‌ టెన్నిస్‌లో చరిత్ర.. రోలర్‌ స్కేటింగ్‌లో రెండు పతకాలు!


Sutirtha and Ayhika Mukherjee Wins bronze medal in Table Tennis at Asian Games 2023: చైనాలోని హాంగ్‌జౌ నగరంలో జరుగుతున్న ఆసియా క్రీడలు 2023లో భారత అథ్లెట్లు సత్తాచాటుతున్నారు. రికార్డులు నమోదు చేస్తూ.. చరిత్రను తిరగరాస్తూ పతకాల వేటలో దూసుకెళ్తున్నారు. ఆదివారం ఒక్కరోజే 15 మెడల్స్‌ గెలిచిన భారత క్రీడాకారులు.. సోమవారం కూడా మెడల్స్ వేట కొనసాగిస్తున్నారు. టేబుల్‌ టెన్నిస్‌ వుమెన్స్‌ డబుల్స్‌ విభాగంలో భారత్‌కు కాంస్యం దక్కింది. సుతీర్థ ముఖర్జీ, ఐహిక ముఖర్జీ సెమీస్ మ్యాచ్‌లో ఓడిపోయారు.

టేబుల్‌ టెన్నిస్‌ వుమెన్స్‌ డబుల్స్‌ సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో ఉత్తర కొరియాకు చెందిన సుయోంగ్ చా మరియు సుగ్యోంగ్ పాక్‌ల చేతిలో సుతీర్థ ముఖర్జీ, ఐహిక ముఖర్జీ 4-3 తేడాతో ఓడిపోయారు. వీరు ఓడిపోయినా కాంస్య పతకంతో భారత టేబుల్ టెన్నిస్‌లో స్వర్ణ యుగానికి నాంది పలికారు. ఆసియా క్రీడల్లో టేబుల్‌ టెన్నిస్‌ డబుల్స్‌ విభాగంలో భారత్‌కు ఇదే మొదటి పతకం కావడం విశేషం. దాంతో ముఖర్జీ సిస్టర్స్‌ సరికొత్త చరిత్ర సృష్టించారు. 2018లో జకార్తాలో పురుషుల జట్టు మరియు మిక్స్‌డ్ జట్టు కాంస్య పతకాలను సాధించాయి.

భారత స్కేటింగ్‌ రిలే టీమ్‌ కూడా కాంస్య పతకం సాధించింది. వుమెన్స్‌ స్పీడ్‌ స్కేటింగ్‌ 3000 మీటర్లలో భారత ప్లేయర్లు కార్తిక జగదీశ్వరన్‌, హీరాల్ సధూ, ఆరతి కస్తూరి కాంస్య పతకం సొంతం చేసుకున్నారు. సమష్టిగా రాణించిన భారత ప్లేయర్స్ 4:34.861 నిమిషాల్లో లక్ష్యాన్ని చేరుకుని పతకం ఖాయం చేసుకున్నారు. మరోవైపు రోలర్‌ స్కేటింగ్‌లో అబ్బాయిలు అదరగొట్టారు. మెన్స్‌ స్పీడ్‌ స్కేటింగ్‌ 3000 మీటర్ల రిలే టీమ్‌ ఈవెంట్లో కాంస్యం కైవసం చేసుకున్నారు.