Leading News Portal in Telugu

Asian Games 2023: ఆసియా క్రీడల్లో పతకాల జోరు.. 60కి చేరిన భారత్ పతకాల సంఖ్య


ఆసియా క్రీడల్లో భారత్ పతకాల పంట పండిస్తోంది. ఇప్పటి వరకు ఇండియా 60 పతకాలు సాధించింది. అందులో 13 బంగారు పతకాలతో పాటు 24 రజత పతకాలు, 23 కాంస్య పతకాలను భారత క్రీడాకారులు గెలిచారు. అయితే పతకాల పట్టికలో మాత్రం భారత్ నాలుగో స్థానంలోనే కొనసాగుతోంది. అంతేకాకుండా ఈరోజు మొత్తం 7 పతకాలను కైవసం చేసుకుంది. తాజాగా.. 4×400 మీటర్ల రేసులో భారత్‌ రజత పతకం సాధించింది. నిజానికి 4×400 మీటర్ల రేసులో భారత్‌కు కాంస్య పతకం వచ్చింది. కానీ రిఫరీ శ్రీలంకపై అనర్హత వేటు వేశారు. దీంతో భారత్‌ కాంస్య పతకం కాస్త రజతానికి చేరుకుంది.

4 x 400 మీటర్ల రేసులో.. మిక్స్‌డ్ టీమ్ ప్లేయర్‌లు మహ్మద్ అజ్మల్, విద్యా రామ్‌రాజ్, రాజేష్ రమేష్, శుభా వెంకటేశన్ మూడవ స్థానంలో నిలిచారు. అంతకుముందు లాంగ్‌జంప్‌లో భారత మహిళా అథ్లెట్‌ ఎన్‌సీ సోజన్‌ రజత పతకాన్ని కైవసం చేసుకుంది. ఎన్‌సీ సోజన్ 6.63 మీటర్ల దూరం దూకి భారత్‌కు రజత పతకాన్ని అందించాడు. ఇదిలా ఉంటే.. నేటి ఆట ముగిసే వరకు తేజస్విన్ శంకర్ 4260 పాయింట్లతో డెకాథ్లాన్‌లో అగ్రస్థానంలో ఉన్నాడు. ఈరోజు ప్రారంభంలో స్కేటర్లు 2 కాంస్య పతకాలను గెలుచుకున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం టేబుల్ టెన్నిస్ మహిళల డబుల్స్ ఈవెంట్‌లో కాంస్యం సాధించింది.

ఇదిలా ఉంటే.. భారత హాకీ జట్టు బంగ్లాదేశ్‌ను 12-0తో ఓడించింది. తద్వారా భారత హాకీ జట్టు సెమీఫైనల్‌కు చేరుకుంది. హర్మన్‌ప్రీత్ సింగ్ నేతృత్వంలోని భారత జట్టు ఆడిన 5 మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది. సెమీ ఫైనల్స్ ఆడేందుకు భారత జట్టు మంగళవారం రంగంలోకి దిగనుంది. సెమీస్‌లో భారత జట్టుకు ఆతిథ్య చైనా నుంచి సవాల్ ఎదురుకావచ్చు. అంతే కాకుండా.. భారత క్రికెట్ జట్టు తన మొదటి మ్యాచ్ ఆడనుంది. భారత క్రికెట్ జట్టు తొలి మ్యాచ్‌లో నేపాల్ తో తలపడనుంది.