Yashasvi Jaiswal Slams Half Century in Asian Games 2023 IND vs NEP Match: ఆసియా క్రీడలు 2023లో భాగంగా భారత్ పురుషుల క్రికెట్ జట్టు నేపాల్‌తో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ఆడుతోంది. హాంగ్జౌలోని పింగ్‌ఫెంగ్ క్యాంపస్ క్రికెట్ ఫీల్డ్ మైదానంలో ఉదయం 6.30కు మొదలైంది. ఈ మ్యాచ్‌లో టాస్ నెగ్గిన భారత కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్లుగా రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్ బరిలోకి దిగారు. భారత్ తన ఇన్నింగ్స్‌ను ఘనంగా ఆరంభించింది.
యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఇన్నింగ్స్ ఆరంభం నుంచే సిక్స్‌లు, ఫోర్లతో చెలరేగుతున్నాడు. కరన్ కేసీ వేసిన రెండో ఓవర్లో రెండు సిక్స్‌లు బాదిన యశస్వి.. సోంపాల్ వేసిన మూడో ఓవర్లో ఓ సిక్స్, ఫోర్ కొట్టాడు. మరోవైపు రుతురాజ్ గైక్వాడ్ కూడా చెలరేగడంతో భారత్ స్కోర్ బోర్డు పరుగులు పెడుతోంది. నేపాల్ బౌలర్లను ఓ ఆటాడుకుంటున్న యశస్వి.. 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదాడు. సందీప్ లామిచానే వేసిన 7వ ఓవర్ మూడో బంతికి సిక్స్ బాది ఫిఫ్టీ మార్క్ అందుకున్నాడు.
రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్ జోరుతో 10వ ఓవర్ మొదటి బంతికే భారత్ స్కోర్ 100కి చేరింది. అయితే దీపేంద్ర సింగ్ వేసిన 10వ ఓవర్ ఐదవ బంతికి గైక్వాడ్ క్యాచ్ ఔట్ అయ్యాడు. గైక్వాడ్ అనంతరం తిలక్ వర్మ క్రీజులోకి వచ్చాడు. 10 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోర్ 104/1. క్రీజులో యశస్వి జైస్వాల్ (73), తిలక్ వర్మ (1) ఉన్నారు. జితేష్ శర్మ, రింకు సింగ్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్ లాంటి హిట్టర్లు ఉండడంతో భారత్ భారీ స్కోర్ చేసే అవకాశం ఉంది.
తుది జట్లు:
భారత్: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, జితేష్ శర్మ (కీపర్), రింకు సింగ్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవి శ్రీనివాసన్ సాయి కిషోర్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్.
నేపాల్: కుశాల్ భుర్టెల్, ఆసిఫ్ షేక్ (కీపర్), సందీప్ జోరా, గుల్సన్ ఝా, రోహిత్ పౌడెల్ (కెప్టెన్), కుశాల్ మల్లా, దీపేంద్ర సింగ్ ఐరీ, సోంపాల్ కమీ, కరణ్ కేసీ, అబినాష్ బోహారా, సందీప్ లామిచానే.