Leading News Portal in Telugu

IND vs NEP: నేపాల్‌పై ఘన విజయం.. ఆసియా క్రీడలు 2203 సెమీస్‌కు చేరిన భారత్!


India Reach Asian Games 2023 Semis after Yashasvi Jaiswal Century: ఆసియా క్రీడలు 2203 పురుషుల క్రికెట్‌ విభాగంలో భారత్ సెమీస్‌కు దూసుకెళ్లింది. హాంగ్‌జౌలోని పింగ్‌ఫెంగ్ క్యాంపస్ క్రికెట్ ఫీల్డ్ మైదానంలో మంగళవారం ఉదయం నేపాల్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్‌లో యువ టీమిండియా 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. 203 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నేపాల్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 179 పరుగులే చేసింది. నేపాల్‌ బ్యాటర్లలో దీపేంద్ర సింగ్ ఐరీ (32) టాప్‌ స్కోరర్‌. భారత బౌలర్లలో రవి బిష్ణోయ్‌, అవేష్‌ ఖాన్‌ తలో మూడు వికెట్స్ పడగొట్టాడు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్స్ కోల్పోయి 202 స్కోరు చేసింది. యశస్వి జైస్వాల్ (100: 49 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్‌లు) సెంచరీ చేశాడు. భారత్ ఇన్నింగ్స్‌ను యశస్వి ఘనంగా ఆరంభించాడు. 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన అతడు.. 48 బంతుల్లో శతకం అందుకున్నాడు. తిలక్ వర్మ (2), జితేష్ శర్మ (5)లు నిరాశపరిచగా.. శివమ్‌ దూబె (25), రింకూ సింగ్‌ (37) చెలరేగారు. నేపాల్‌ బౌలర్లలో దిపేంద్ర సింగ్‌ 2 వికెట్లు పడగొట్టాడు.

అనంతరం లక్ష్య ఛేదనలో నేపాల్ 179/9 స్కోరుకే పరిమితమైంది. దీపేంద్ర సింగ్ ఐరీ (32) టాప్‌ స్కోరర్. ఓ పక్క వికెట్లు పడుతున్నా.. ఏమాత్రం బెదరకుండా నేపాల్‌ బ్యాటర్లు పోటీపడీ సిక్స్‌లు బాదేశారు. దాంతో ఒకానొక దశలో నేపాల్ చేతిలో భారత్‌కు ఓటమి తప్పదా? అన్న అనుమానం కలిగింది. అయితే కీలక సమయంలో బౌలర్లు రాణించడంతో టీమిండియా ఊపిరిపీల్చుకుంది. భారత బౌలర్లు అవేశ్ ఖాన్ 3, రవి బిష్ణోయ్ 3 వికెట్స్ తీయగా.. అర్ష్‌దీప్‌ సింగ్ 2, సాయి కిశోర్ ఒక వికెట్ తీశారు.